Wednesday, July 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ

జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ

- Advertisement -

ద్వైపాక్షిక సంబంధాల్లో
తాజా పరిణామంపై వివరణ
ఇతర నేతలతోనూ చర్చలు
బీజింగ్‌ :
చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మంగళవారం ఆ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. గడచిన ఐదేండ్ల కాలంలో భారత విదేశాంగ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. తూర్పు లడఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించుకొని ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్‌ చైనా వచ్చారు.ద్వైపాక్షిక సంబంధాల్లో చోటుచేసుకుం టున్న తాజా పరిణామాన్ని చైనా అధినేతకు వివరించానని జిన్‌పింగ్‌తో సమావేశమైన అనంతరం జైశంకర్‌ తెలిపారు. ‘సహచర ఎస్‌సీఓ మంత్రులతో కలిసి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీల శుభాకాంక్షలను ఆయనకు తెలియజేశాను. ద్వైపాక్షిక సంబంధా ల్లో తాజా పరిణామాన్ని గురించి వివరించాను’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 2020 జూన్‌లో జరిగిన గాల్వన్‌ లోయ ఘర్షణ తర్వాత ఇరువురు నేతలు మొదటిసారిగా సమావేశమ య్యారు. సంఘర్షణలు జరిగిన డెమ్‌ఛాక్‌, డెప్‌శాంగ్‌ ప్రాంతాల్లో నిరాయుధీకరణపై గతేడాది అక్టోబరులో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పటి నుంచి ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జైశంకర్‌ సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమై సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్తతలను నివారించేందుకు రెండు దేశాలు తప్పనిసరిగా ముందడుగు వేయాల్సి ఉందని చెప్పారు. ‘ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థాయికి చేర్చే విషయంలో గత తొమ్మిది నెలల్లో మేం మంచి పురోగతి సాధించాం. ఉద్రిక్తతల నివారణ సహా సరిహద్దు సమస్యకు సంబంధించిన ఇతర అంశాలను ఇప్పుడు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కీలక ఖనిజాలపై చైనా విధించిన ఎగుమతి ఆంక్షలను గుర్తుచేస్తూ.. ఆంక్షలతో కూడిన వాణిజ్య చర్యలను, అవరోధాలను నివారించాలని కోరారు. అభిప్రాయబేధాలు విభేదాలు కాకూడదని, రెండు దేశాల మధ్య నెలకొన్న పోటీ ఘర్షణకు దారితీయకూడదని నొక్కి చెప్పారు. చైనా ఉపాధ్యక్షుడు హన్‌ జెంగ్‌తో కూడా జైశంకర్‌ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని వివరించారు. తన పర్యటన సందర్భంగా చైనా నేతలతో జరుపుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌సీఓ అధ్యక్ష పదవికి చైనా అభ్యర్థిత్వాన్ని భారత్‌ బలపరుస్తుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -