యశస్వి అజేయ అర్థ సెంచరీ
ముంబయిపై రాయల్స్ గెలుపు
రాజస్తాన్ 150/3 ముంబయి 123/9
రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్. ఐపీఎల్19వ సీజన్‌లో రాయల్స్ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్లపై రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (77 నాటౌట్, 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (39, 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) శివతాండవం చేశారు. రాయల్స్ తొలుత 11 ఓవర్లలో 150/3 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి ఇండియన్స్ చేతులెత్తేసింది.
నవతెలంగాణ-గువహటి
రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. ముంబయి ఇండియన్స్‌పై 27 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ పైచేయి సాధించి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. 151 పరుగుల భారీ ఛేదనలో ముంబయి ఇండియన్స్ చతికిల పడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (5), రియాన్ రికెల్టన్ (8), సూర్యకుమార్ యాదవ్ (6), తిలక్ వర్మ (14), హార్దిక్ పాండ్య (9) ఛేదనలో విఫలమయ్యారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (77 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (39, 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) విశ్వరూపం చూపించారు.
యశస్వి, సూర్యవంశీ అదుర్స్
టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ వర్షం అంతరాయం దృష్టిలో ఉంచుకుని తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (39), యశస్వి జైస్వాల్ (77 నాటౌట్) తొలి బంతి నుంచే దండయాత్ర చేశారు. తొలి వికెట్‌కు ఐదు ఓవర్లలో 80 పరుగులు జోడించి రాయల్స్ భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. సూర్యవంశీ ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెలరేగాడు. యశస్వి జైస్వాల్ ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. ధ్రువ్ జురెల్ (2) నిరాశపరిచినా.. రియాన్ పరాగ్ (20, 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) జతగా జైస్వాల్ దంచికొట్టాడు. షిమ్రోన్ హెట్‌మయర్ (6 నాటౌట్) ఏడు బంతులు ఆడినా ఒక్క బౌండరీ సాధించలేదు. అయినా, యశస్వి జైస్వాల్ అజేయ అర్థ శతక విధ్వసంతో రాయల్స్ 11 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో గజాన్ఫార్ (2/21), శార్దుల్ ఠాకూర్ (1/36) వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో చతికిల
భారీ ఛేదనలో ముంబయి ఇండియన్స్ తేలిపోయింది. రాయల్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి ముంబయి బ్యాటర్లకు ముకుతాడు వేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రియాన్ రికెల్టన్ (8) నిష్క్రమించగా.. రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6), తిలక్ వర్మ (14), హార్దిక్ పాండ్య (9) అతడి బాటలోనే నడిచారు. 5 ఓవర్లలో 46 పరుగులకు ముంబయి ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయింది. నమన్ ధిర్ (25, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఇంపాక్ట్ ప్లేయర్ రూథర్‌ఫోర్డ్ (25, 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓటమి అంతరం కుదించే ప్రయత్నం చేశారు. 11 ఓవర్లలో 9 వికెట్లకు ముంబయి ఇండియన్స్ 123 పరుగులే చేసింది. రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోరు (2/25), బర్గర్ (2/21), సందీప్ శర్మ (2/26) రెండేసి వికెట్లు పడగొట్టారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ కనీస పోటీ ఇవ్వగల జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. రాజస్తాన్ రాయల్స్ గువహటిలో ముంబయి ఇండియన్స్‌కు ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇటు బ్యాట్‌తో, అటు బంతితో ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించారు. మేటీ బౌలింగ్ లైనప్‌ను తొలి 5 ఓవర్లలోనే సూర్యవంశీ, జైస్వాల్‌లు దంచికొట్టగా.. బౌలర్లు సైతం తొలి 5 ఓవర్లలోనే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించారు. బ్యాటర్లు లక్ష్య ఛేదనలో పేకమేడలా కుప్పకూలగా.. పరుగుల వరదకు అడ్డుకట్ట వేయటంలో బౌలర్లు విఫలం అయ్యారు. ఎడతెగని వర్షంతో మ్యాచ్ సాధ్యం కాదు అనుకునే పరిస్థితుల్లో 11 ఓవర్ల గేమ్‌ను రాజస్తాన్ రాయల్స్ శాసించింది. ముంబయి ఇండియన్స్‌తో ముఖాముఖి రికార్డు 33 మ్యాచ్‌ల్లో 16-17తో లెక్క సరి చేసింది.
వర్షం అంతరాయం
ఈడెన్‌గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ వర్షార్పణం కాగా.. గువహటిలో ముంబయి ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ సైతం వరుణుడి ఖాతాలోనే పడినట్టు కనిపించింది. వర్షంతో తొలుత టాస్ ఆలస్యం కాగా.. వర్షం క్రమంగా ఊపందుకుంది. 9.30 గంటల సమయంలో వర్షం నెమ్మదించగా, 10.10 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. దీంతో 20 ఓవర్లను కాస్త 11 ఓవర్లకు కుదించారు. పవర్‌ప్లే 3.2 ఓవర్లుగా నిర్ణయించారు.



