Saturday, October 11, 2025
E-PAPER
Homeఆటలుజైస్వాల్‌ శతక జోరు

జైస్వాల్‌ శతక జోరు

- Advertisement -

అజేయ 173తో చెలరేగిన యువ ఓపెనర్‌
అర్థ సెంచరీతో రాణించిన సాయి సుదర్శన్‌
వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి రోజు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 318/2

యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (173 నాటౌట్‌) శతకంతో దండెత్తాడు. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్ల గ్రౌండ్‌లో కరీబియన్‌ బౌలర్లతో ఆడుకున్న యశస్వి జైస్వాల్‌ తొలి రోజే 173 పరుగులతో చెలరేగాడు. సాయి సుదర్శన్‌ (87) సైతం అర్థ సెంచరీతో రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు 318 పరుగులు చేసింది. జైస్వాల్‌, గిల్‌ క్రీజులో ఉండగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై కన్నేసింది.

నవతెలంగాణ-న్యూఢిల్లీ
యశస్వి జైస్వాల్‌ (173 నాటౌట్‌, 253 బంతుల్లో 22 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. బి. సాయి సుదర్శన్‌ (87, 165 బంతుల్లో 12 ఫోర్లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. జైస్వాల్‌, సాయి సుదర్శన్‌ మెరుపులతో వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 318/2 పరుగుల భారీ స్కోరు చేసింది. కరీబియన్‌ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్‌ చేసినా.. యశస్వి జైస్వాల్‌ వన్‌మ్యాన్‌ షోతో భారత్‌ తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. వెస్టిండీస్‌ స్పిన్నర్‌ జొమెల్‌ వారికన్‌ (2/60) రెండు వికెట్లు పడగొట్టి రాణించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (20 నాటౌట్‌, 68 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా క్రీజులో నిలిచాడు.

ఓపెనర్ల శుభారంభం
తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. శీతల వాతావరణంలో బంతి అందుకున్న వెస్టిండీస్‌ బౌలర్లు క్రమశిక్షణ చూపించారు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేశారు. కానీ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌ (38, 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. ఆరంభంలో యశస్వి జైస్వాల్‌ నెమ్మదిగా ఆడినా.. కెఎల్‌ రాహుల్‌ దూకుడు చూపించాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన రాహుల్‌… స్పిన్నర్‌ వారికన్‌పై ఎదురుదాడికి ప్రయత్నంచాడు. ఈ క్రమంలో స్టంపౌట్‌గా నిష్క్రమించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 17.3 ఓవర్లలో 58 పరుగులు జోడించారు.

జైస్వాల్‌, సాయిసుదర్శన్‌ మెరుపుల్‌
పరుగుల వేటను నెమ్మదిగా మొదలెట్టినా కరీబియన్‌ బౌలర్లపై యశస్వి జైస్వాల్‌ తనదైన జోరు చూపించాడు. స్పిన్‌, పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. రాహుల్‌తో కలిసి 58 పరుగులు, సాయి సుదర్శన్‌తో కలిసి 193 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. పది ఫోర్లతో 82 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌.. లంచ్‌ సమయానికి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించాడు. క్రీజులో కుదురుకున్న సాయి సుదర్శన్‌ సైతం చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. 9 ఫోర్లతో 87 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన సాయి సుదర్శన్‌.. కెరీర్‌ తొలి శతకం దిశగా సాగాడు. లంచ్‌ సెషన్‌లో భారత్‌ వికెట్‌ కోల్పోలేదు. కానీ టీ సెషన్‌ ఆరంభంలోనే మూడంకెల స్కోరుకు 13 పరుగుల దూరంలో వారికన్‌ మాయకు వికెట్‌ కోల్పోయాడు. దీంతో 193 పరుగుల భాగస్వామ్యనికి తెరపడింది.

గిల్‌తో కలిసి దూకుడు
16 ఫోర్లతో 145 బంతుల్లో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్‌.. శతకం తర్వాత పరుగుల వేటలో వేగం పెంచాడు. సాయి సుదర్శన్‌ అవుటైనా.. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి మరో 67 పరుగులు అజేయంగా జోడించాడు. గిల్‌ మూడు ఫోర్లతో ఫామ్‌ చాటుకున్నాడు. 19 ఫోర్లతో 224 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ చేరుకున్న యశస్వి జైస్వాల్‌.. కెరీర్‌ మూడో డబుల్‌ సెంచరీ దిశగా వేగంగా దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆటలో 90 ఓవర్లలో 2 వికెట్లకు భారత్‌ 318 పరుగులు చేసింది. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటంతో నేడు భారత్‌ దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ నాటౌట్‌ 173, కెఎల్‌ రాహుల్‌ (స్టంప్డ్‌) టెవిన్‌ (బి) వారికన్‌ 38, బి సాయి సుదర్శన్‌ (ఎల్బీ) వారికన్‌ 87, శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 20, మొత్తం : (90 ఓవర్లలో 2 వికెట్లకు) 318.
వికెట్ల పతనం : 1-58, 2-251.
బౌలింగ్‌ : జైడెన్‌ సీయల్స్‌ 16-1-59-0, అండర్సన్‌ ఫిలిప్‌ 19-2-44-0, జస్టిన్‌ గ్రీవ్స్‌ 8-1-26-0, జోమెల్‌ వారికన్‌ 20-3-60-2, రోస్టన్‌ ఛేజ్‌ 13-0-55-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -