Sunday, March 1, 2026
E-PAPER
Homeఆటలుజమ్మూ కశ్మీర్‌ కొత్త చరిత్ర

జమ్మూ కశ్మీర్‌ కొత్త చరిత్ర

- Advertisement -

తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరణ
– అగ్రజట్టు కర్నాటకపై టైటిల్‌ పోరులో పైచేయి

దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర. రంజీ ట్రోఫీకి కొత్త చాంపియన్‌. 1959-60 సీజన్‌లోనే తొలిసారి రంజీ ట్రోఫీ బరిలో నిలిచినా, దశాబ్దాల పాటు పసికూనగా నెట్టుకొచ్చిన జమ్మూ కశ్మీర్‌ చరిత్ర లిఖించింది. ఎనిమిది సార్లు చాంపియన్‌ కర్నాటకను చిత్తు చేస్తూ.. రంజీ ట్రోఫీ విజేతగా అవతరించింది. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. 2025-26 సీజన్‌ రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది.

నవతెలంగాణ-హుబ్లీ

జమ్మూ కశ్మీర్‌ చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి విజేతగా అవతరించింది. కర్నాటకలోని కెఎస్‌సీఏ హుబ్లీ స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆతిథ్య జట్టు, ఎనిమిది సార్లు చాంపియన్‌ కర్నాటకపై జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో పైచేయి సాధించింది. ఐదు రోజుల పాటు బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. కెఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, దేవదత్‌ పడిక్కల్‌, ప్రసిద్‌ కృష్ణ వంటి భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లతో కూడిన కర్నాటక రంజీ ట్రోఫీ ఫైనల్లో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. జమ్మూ కశ్మీర్‌ చరిత్రను తిరగరాసింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీ జమ్మూ కశ్మీర్‌ సొంతమైంది. 60 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచిన పేసర్‌ అకిబ్‌ నబి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ నిలువగా.. సెంచరీతో జమ్మూ కశ్మీర్‌ను ముందంజలో నిలిపిన శుభమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఫైనల్‌’గా నిలిచాడు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌, కార్యదర్శి దేవాజిత సైకియాలు జమ్మూ కశ్మీర్‌ కెప్టెన్‌ పరాస్‌కు రంజీ ట్రోఫీ టైటిల్‌ను ప్రదానం చేశారు.

అజేయ సెంచరీలు
నాల్గో రోజు ఆట ముగిసేసరికి జమ్మూ కశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌లో 186/4తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్లు అజేయంగా క్రీజులో నిలువటంతో కర్నాటకకు ఎటువంటి ఆశలు లేవు. అయినా, ఆ జట్టు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ డ్రాకు నిరాకరించాడు. ఆఖరు రోజు పోరాడేందుకు సిద్ధపడ్డాడు. నాల్గో రోజు ఆఖరు సెషన్లో మెప్పించిన కమ్రాన్‌ ఇక్బాల్‌ (160 నాటౌట్‌, 311 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాహిల్‌ లోత్రా (101 నాటౌట్‌, 226 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఐదో రోజు ఉదయం సెషన్లోనూ దుమ్మురేపారు. అజేయ సెంచరీలు సాధించిన ఇక్బాల్‌, సాహిల్‌లు జమ్మూ కశ్మీర్‌ ఆధిక్యం 633 పరుగులకు చేర్చారు. లంచ్‌ విరామం తర్వాత, డ్రాకు కర్నాటక కెప్టెన్‌ అంగీకరించాడు. మయాంక్‌ అగర్వాల్‌తో ఇక్బాల్‌, సాహిల్‌ కరచాలనంతో జమ్మూ కశ్మీర్‌ శిబిరంలో సంబురాలకు తెరలేచింది. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన జమ్మూ కశ్మీర్‌ ఆటగాళ్లు చారిత్రక విజయ సంబురాల్లో మునిగితేలారు. జమ్మూ కశ్మీర్‌ ఆటగాళ్ల సెలబ్రేషన్స్‌ ముగిసే వరకు కర్నాటక క్రికెటర్లు ఓపిగా గ్రౌండ్‌లోనే ఎదురుచూసి, ఆ తర్వాత కరచాలనం చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. కర్నాటక ఓటమిలోనూ క్రీడా స్ఫూర్తిని చాటుకుని విమర్శకుల మెప్పు పొందింది.

క్రికెటర్లతో సీఎం కేరింతలు
జమ్మూ కశ్మీర్‌ చారిత్రక రంజీ ట్రోఫీ విజయానికి రంగం సిద్ధం చేసుకోవటంతో.. అరుదైన విజయ క్షణాలను ఆటగాళ్లతో కలిసి పంచుకునేందుకు, గెలుపు ఘట్టాని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా శుక్రవారం రాత్రే బెంగళూరుకు చేరుకున్నారు. ఉదయం ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌కు వచ్చిన ఒమర్‌ అబ్దుల్లా.. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌, కార్యదర్శి దేవాజిత్‌ సైకియాలతో కలిసి ఆఖరు రోజు ఆటను వీక్షించారు. టైటిల్‌ ప్రదానం అనంతరం జమ్మూ కశ్మీర్‌ క్రికెటర్లతో కలిసి కేరింతలు కొట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ 2021-24 వరకు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌కు డైరెక్టర్‌గా పనిచేయటంతో.. ఈ అద్వితీయ విజయంలో ఆ పాత్రను క్రికెటర్లు, అడ్మినిస్ట్రేటర్లు గుర్తు చేశారు.

సంక్షిప్త స్కోరు వివరాలు :
జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ : 584/10 (శుభమ్‌ 121, యావర్‌ 88, సాహిల్‌ 72, కన్హయ్య 70, సమద్‌ 61, ప్రసిద్‌ కృష్ణ 5/98)
కర్నాటక తొలి ఇన్నింగ్స్‌ : 293/10 (మయాంక్‌ అగర్వాల్‌ 160, కృతుక్‌ 31, అకిబ్‌ నబి 5/54, సునీల్‌ కుమార్‌ 2/51, యుధ్‌వీర్‌ సింగ్‌ 2/55)
జమ్మూ కశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌ : 342/4 డిక్లేర్డ్‌ (కమ్రాన్‌ ఇక్బాల్‌ 160 నాటౌట్‌, సాహిల్‌ 101 నాటౌట్‌, ప్రసిద్‌ కృష్ణ 2/42, శ్రేయాస్‌ గోపాల్‌ 1/84)
ఫలితం : మ్యాచ్‌ డ్రా. తొలి ఇన్నింగ్స్‌ 291 పరుగుల ఆధిక్యంతో జమ్మూ కశ్మీర్‌కు టైటిల్‌.

గాలివాటం కాదు!
జమ్మూ కశ్మీర్‌ విజయం ఏదో గాలి వాటం కాదు. 1959-60 రంజీ సీజన్‌లో తొలిసారి పోటీపడిన ఆ జట్టు.. తొలి టైటిల్‌ కోసం ఇన్నేండ్లు ఎదురుచూసింది. 2001-02 సీజన్‌లో తొలిసారి నాకౌట్‌ దశకు అర్హత సాధించిన జమ్మూ కశ్మీర్‌, ఆ తర్వాత 2013-14లో మరోసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ను సునీల్‌ జోషి, ఇర్ఫాన్‌ పఠాన్‌ సహా మిథున్‌ మన్హాస్‌ తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాలు, గాడి తప్పిన పరిపాలన సహా బీసీసీఐ నిధులు పక్కదారి పట్టిన దుస్థితిలో జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ కుంటుపడింది. ఈ సమయంలో జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ను నేరుగా పర్యవేక్షించిన బీసీసీఐ.. పరిపాలకులను నియమించి ప్రతిభావంతులైన క్రికెటర్లను అకాడమీలో శిక్షణతో సానబట్టింది. దేశవాళీ క్రికెట్‌ దిగ్గజం ముంబయిపై విజయంతో జమ్మూ కశ్మీర్‌ క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో ఒకట్రెండు సంచలనాలపై కాకుండా.. ఏకంగా టైటిల్‌పైనే గురి పెట్టారు. ఈ సీజన్‌లో గ్రూప్‌ దశలో ముంబయి చేతిలో ఓడినా.. ఆ తర్వాత వరుస విజయాలతో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మాజీ చాంపియన్లు మధ్యప్రదేశ్‌, బెంగాల్‌ను వరుసగా క్వార్టర్‌ఫైనల్‌, సెమీఫైనల్లో చిత్తు చేసిన జమ్మూ కశ్మీర్‌.. ఫైనల్లో మరో మాజీ చాంపియన్‌ కర్నాటకపై పైచేయి సాధించింది. చాంపియన్లను కొడుతూ.. చాంపియన్‌గా ఎదిగిన జమ్మూ కశ్మీర్‌ ఇక నుంచి దేశవాళీ క్రికెట్‌లో అగ్ర జట్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -