నవతెలంగాణ- ఆలేరు రూరల్
గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డు పునరుద్ధరణ చేపట్టాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్ చేపట్టిన నిరసన దీక్షకు బుధవారం జనని స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జనని స్వచ్చంద సేవా సంస్థ ఫౌండర్ & చైర్మన్ మైదం భాస్కర్ మాట్లాడుతూ ప్రజా సౌకర్యార్థం నిర్మించిన గుండ్లగూడెం–పెంబర్తి రైల్వే గేట్ల మధ్య తారు రోడ్డు వాహనాల తాకిడితో పూర్తిగా ధ్వంసమైందని దాన్ని తక్షణమే పునరుద్ధరించి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను డిమాండ్ చేశారు.
అనంతరం నిరసన దీక్షలో ఉన్న మూడవత్ అశోక్ నాయక్ మాట్లాడుతూ.. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు.లేనిపక్షంలో సమస్య పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి జనని స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు పేరపు ఆనంద్,కన్వీనర్ కమలాకర్ కుంతావత్,సభ్యులు జూకంటి సంపత్,జూకంటి కృష్ణ, కుందే గణేష్,పడకంటి చంద్రశేఖర్,మద్దూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.



