మాటకు లేని బలం పాటకున్నదనే భావంతో శాస్త్రాంశాలు, సత్యం- సైన్స్ జోడించి పాటలతో పాఠాలు, సైన్స్ గేయాలు రాశారు కవి మహేంద్రం. ‘మొదట్లో మనం మన అలవాట్లను తయారు చేసుకుంటే ఆపైన కాలక్రమేణా అవి మనలను తయారుచేస్తాయి’ అంటాడు డ్రైడెన్. పిల్లలకు ఆసక్తికరంగా బోధించుటకై సృజనాత్మక పద్ధతులను సృష్టించుటకు నిరంతరం శ్రమించే సైన్స్ ఉపాధ్యాయులకు, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం, సమిధలైన విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఈ నా కృషి అంకితం అంటారు కవి. మానవ మనుగడకు మూలం సైన్స్. ఆదిమ మానవుని దశ నుండి నేటి కంప్యూటర్ యుగానికి ఎదగడానికి మూలం సైన్స్.
విజ్ఞాన శాస్త్రంలోని వివిధ ఆవిష్కరణల గూర్చి, ప్రకృతిలోని వివిధ వస్తువులు, విషయాలను గూర్చి తెలుసుకొని, అర్థం చేసుకుని, భావి జీవితంలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి చిన్నతనం నుండే సైన్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధించడం తెలిసిందే. సైన్స్ విషయాల్ని ఆకర్షించేలా పాటల రూపంలో రాసి సైన్స్ పట్ల మక్కువ పెరిగేలా ఈ పాటల సంపుటి తెచ్చారు మహేంద్రం. ఈయన గతంలో ‘వసంతగానం’, ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్ర, ప్రమిద లాంటివి రాశారు. ఇది వారి 4వ పుస్తకం. గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ చక్కటి ముందుమాట రాశారు. ‘మురళీ మోహన రవముగ వీణానాదముగ ప్రకృతి చిత్ర గీతముగ, వసంత గానకేళీగా’ అని ధ్వని శక్తి గూర్చి గీతం రాశారు.
‘ఓజోను పొర పగిలితే, వీపు పగులును/ శ్వాసకోశ వ్యాధులెన్నో పట్టి విడువవూ’, ‘కాల్వలందు అడ్డుపడి, కవరులెన్నో నిలిచితె/ దోమలెన్నో వృద్ధిచెంది, వ్యాధులను తెచ్చును’ అంటూ పర్యావరణం, కాలుష్యాను దృష్టిలో పెట్టుకుని ఓ హెచ్చరికలా చక్కటి గీతాలను రాశారు. మానవ శరీరం, జీర్ణక్రియ, అతిసారవ్యాధి, అమ్మా, ప్రకృతి, పుడమి లాంటి గేయాలు బాలబాలికల్ని అలరిస్తాయి. ఓ మంచి విలువైన ప్రయత్నం ఇది.
– తంగిరాల చక్రవర్తి, 9393804472
పాటతో పాఠాలు నేర్పిన జనవిజ్ఞాన వేదిక
- Advertisement -
- Advertisement -