– అభినందించి, సన్మానించిన సర్పంచ్
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బీబీపేట్ మండలం జనగాం గ్రామానికి చెందిన పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థిని హారిక ఇస్రో (ISRO) సందర్శనకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిందనీ ఆ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామ పాఠశాలలో ఆ విద్యార్థినిని అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్య ప్రాముఖ్యతపై అవగాహన తక్కువగా ఉన్న సామాజిక పరిస్థితుల్లోనూ హారిక ఈ ఘన విజయం సాధించడం అభినందనీయమని ప్రశంసించారు.
హారిక సాధనలో పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావం కీలకంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఇలాంటి అవకాశాలు గ్రామీణ విద్యకు దిశానిర్దేశం చేస్తాయని అభిప్రాయపడ్డారు. హారిక ఇస్రో సందర్శన ద్వారా భవిష్యత్తులో శాస్త్ర రంగంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ విజయంతో జనగాం గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎంఎన్ స్వామి, వార్డ్ నెంబర్ వడ్ల నరసింహ చారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



