వివాదాస్పద స్తంభంపై కేంద్ర బలగాల పహారాలో కార్యక్రమం
మదురై : తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు కొండపై ఉన్న ‘దీపతూన్’ రాతి స్తంభంపై సంప్రదాయబద్ధంగా దీపాన్ని వెలిగిం చారు. కొండపై భద్రతా బాధ్యతను సుప్రీంకోర్టు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగానికి (సిఆర్‌పిఎఫ్) అప్పగించింది. దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, సంఘ్ పరివార్ శక్తులు ఉద్రిక్తతలు పెంచుతాయన్న సమాచారంతో, శాంతిభద్రతల రీత్యా తమిళనాడు ప్రభుత్వం పాత ప్రదేశంలోనే దీపం వెలిగించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, శుక్రవారం ఆ రాష్ట్ర అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో పాటు దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించింది. ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసి, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లతో కూడిన 13 మంది సభ్యుల కమిటీని నియమించింది. కొండపై పర్యవేక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు కేంద్ర బలగాలకు (సిఆర్‌పిఎఫ్) అప్పగించింది. కేంద్ర బలగాలు కొండను తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. మరోవైపు, కొండపై ఉన్న దర్గాలో ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.






కామెంట్‌లు (0)