​దేశానికే ఆదర్శంగా క్రీడా పోటీలు

2 గంటల క్రితం

Sports competitions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఖేలో ఇండియా క్రీడలతో తెలంగాణ పేరు మారుమోగాలి : మంత్రి వాకిటి శ్రీహరి

​నవతెలంగాణ-మియాపూర్

​తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ క్రీడల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, ప్రచార కార్యక్రమాలపై పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛతో పాటు అవసరమైన నిధులు అందిస్తున్నామని తెలిపారు. అదనపు నిధులు అవసరమైతే సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా వేదికలు, క్రీడా సామగ్రి, క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా వంటి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలకతీతంగా భాగస్వామ్యం చేయాలని, పోలీసు, మున్సిపల్, విద్యాశాఖలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.​ఖేలో ఇండియా క్రీడలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. సినీ ప్రముఖులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులను ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 10 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, 33 జిల్లాల్లో ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఖేలో ఇండియా మస్కట్ 'పాలపిట్ట'తో పాటు 'నషా ముక్త్ తెలంగాణ' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర క్రీడారంగానికి రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు సాధించేందుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్‌ శివసేన రెడ్డి, వైస్ ‌చైర్మెన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలదేవి, నోడల్ అధికారులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

​



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్