నేడు కొచ్చిలో సీజేపీ నిరసన
రాజేంద్ర మైదాన్‌లో సాయంత్రం 4 గంటలకు ఆందోళన
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సర్‌ను రద్దు చేయండి’ నినాదంతో నిరసనకు పిలుపు
తిరువనంతపురం : ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళన బాట పట్టింది. కొంతకాలం నిరసన కార్యక్రమాలకు విరామం ప్రకటించిన ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. తాజాగా కేరళలోని కొచ్చిలో మరో నిరసనకు పిలుపునిచ్చారు. నేటి (శనివారం) సాయంత్రం 4 గంటలకు రాజేంద్ర మైదాన్‌లో జరిగే ఈ ఆందోళనలో పాల్గొనాలని పార్టీ మద్దతుదారులను కోరారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సర్‌ను రద్దు చేయండి’ అనే నినాదంతో ఈ నిరసన చేపట్టనున్నారు. అభిజీత్ దీప్కే నిరసనలకు విరామం ప్రకటించిన తర్వాత సీజేపీ నుంచి వెలువడిన తొలి ఆందోళన పిలుపు ఇదే కావడం గమనార్హం.
మేలో సీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి అది పలు ప్రజా సమస్యలపై నిరసనలు చేపడుతోంది. తొలుత నీట్ పరీక్షలో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ఆందోళన నిర్వహించింది. అనంతరం ఆగస్టులో ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల కొరత, సరైన వసతులు లేకపోవడం వంటి సమస్యలను ఈ ప్రచారం ద్వారా వెలుగులోకి తెచ్చింది.
సెప్టెంబర్ చివరి వారంలో తన ఉద్యమాన్ని ఎన్నికల సంఘం వైపు మళ్లించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన వివాదస్పద సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే, అక్టోబర్ 13న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన సందర్భంగా.. నిరసన ప్రదేశంగా గుర్తింపు రద్దు చేసిన ప్రాంతంలోకి వెళ్లి జాతీయ జెండాను ఎగురవేసిన ఆరోపణలపై సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 16న తలపెట్టిన తిరంగా మార్చ్‌కు ముందు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పార్టీకి చెందిన ముగ్గురు కీలక నాయకులు అందుబాటులో లేకుండా పోయారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందని ప్రకటించినప్పటికీ ఆ మార్చ్ ముందుకు సాగలేదు.
కుటుంబాలతో గడపాలని దీప్కే విజ్ఞప్తి
ఈ పరిణామాల మధ్య దసరా పండుగ సందర్భంగా దీప్కే భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పండుగ సమయంలో మద్దతుదారులు తమ కుటుంబాలతో సమయం గడపాలని కోరారు. ఉద్యమాల్లో పాల్గొంటున్న వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను గుర్తుచేశారు. వారు తమ కుటుంబాలతో పండుగను జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొనడం నిరసనకారుల సొంత నిర్ణయమే అయినప్పటికీ.. దాని ప్రభావాన్ని వారి కుటుంబాలు కూడా భరించాల్సి వస్తోందని వివరించారు. ఈ సందేశం నేపథ్యంలో సీజేపీ తన ఆందోళనలకు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్టు అప్పట్లో భావించారు.
సీజేపీ నేతలను ప్రశ్నించిన క్రైమ్ బ్రాంచ్
మరోవైపు, అక్టోబర్ 13న జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సీజేపీ నేతలను విచారించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేలను నవంబర్ 5న రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించింది. ఈ విచారణలో పోలీసులు దాదాపు 70 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అయితే, కొన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు ఇవ్వలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇండియా బ్లాక్ నిరసనకు దూరంగా సీజేపీ
ఎన్నికల అక్రమాలపై ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనలకు మద్దతు ఇస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపును కొనసాగించాలని సీజేపీ భావిస్తోంది. అక్టోబర్ 31న ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో అభిజీత్ దీప్కే సమావేశమయ్యారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఉద్యమానికి, పార్టీ నాయకుల అరెస్టులకు మద్దతు తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. అయితే, నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ఓట్ల చోరీ వ్యతిరేక ర్యాలీకి సంఘీభావం ప్రకటించినప్పటికీ.. ఆ కార్యక్రమంలో సీజేపీ అధికారికంగా పాల్గొనబోదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, స్వతంత్రంగా పనిచేసే వేదికగానే తమ సంస్థ కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా, వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా మద్దతు ఇస్తామని వెల్లడించారు. తాజాగా కొచ్చిలో నిరసనకు పిలుపునివ్వడంతో సీజేపీ మళ్లీ ఉద్యమ కార్యాచరణను ప్రారంభించినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సర్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌నే ప్రధాన అంశంగా చేసుకుని ఆ పార్టీ తన పోరాటాన్ని కొనసాగించనుంది.





కామెంట్‌లు (0)