ఐదుగురు మృతి మరొకరి గాయాలు
పోలీసు ప్రధాన కార్యాలయం సమీపంలో దాడి
గౌహతి : బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజల భద్రతకు రక్షణ లేకుండా పోతోంది. అస్సాంలోని గౌహతిలో పోలీసు ప్రధాన కార్యాలయం సమీపాన ఓ హోటల్‌లో సోమ వారం రాత్రి చోటుచేసుకున్న కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. హోటల్ యజమానితో తలెత్తిన ఆస్తి వివాదం కారణంగా ఓ దుండగుడు జరిపిన ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారని, మరొకరు గాయపడ్డారని పోలీసులు పేర్కొ న్నారు. అసోం పోలీస్ ప్రధాన కార్యాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో జిఎస్ రోడ్డులోని బోరా సర్వీస్‌కు ఎదురుగా ఉన్న 'హోటల్ బిలాస్ ఇన్'లో ఈ ఘటన జరిగింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తుపాకీ గాయాల య్యాయని పోలీస్ కమిషనర్ పార్థ సారథి మహంత తెలిపారు. వారిలో ఐదుగురు మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన గంటలోపే నిందితుడిని పల్టాన్ బజార్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన 32 బోర్ లైసెన్స్ కలిగిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ఘనకాంత గొగోయ్ సుమారు ఏడాది క్రితం హోటల్‌ను లీజుకు తీసుకున్నాడని కమిషనర్ వివరించారు. దీనికి సంబంధించే ఇరువురి మధ్య వివాదానికి దారి తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ వివాదం కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే విషయంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా హోటల్ యజమానికి సంబంధించిన వ్యక్తులే కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఈ ఘటనలో మరణించిన ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మరో మృతుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి కూడా అదే గ్రామానికి చెందినవాడని వెల్లడించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో హెలేనా భారలి, దేబోర్షి కశ్యప్, నారాయణ్ దాస్ ఉన్నట్లు మరో అధికారి తెలిపారు. మిగిలిన మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
శాంతిభద్రతలపై గౌరవ్ గొగోయ్ ఆందోళన
ఈ ఘటనపై అసోం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జోర్హాట్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల్లో ఐదుగురు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి, హోంమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఘటనకు బాధ్యత వహించాలని, పెరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)