తమిళనాడు జైలు నుంచి 17 మంది ఖైదీలు జంప్
విస్తృత గాలింపులో ఐదుగురు అరెస్ట్
తొమ్మిది మంది సిబ్బంది సస్పెన్షన్
చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా అండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్ జైలు నుంచి సోమవారం రాత్రి 17 మంది రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. జైలులోని ఒకే సెల్ బ్లాకులో ఉన్న వీరందరూ ఓ పథకం ప్రకారం సినీ ఫక్కిలో పారిపోయారు. సెల్‌లోని ఓ ఖైదీకి అకస్మాత్తుగా తీవ్రమైన మూర్ఛ వ్యాధి వచ్చిందని, అతను స్పృహ తప్పి పడిపోయాడని ఖైదీలంతా పెద్ద పెట్టున అరుస్తూ నాటకం ఆడారు. ఖైదీని కాపాడేందుకు జైలు సిబ్బంది సెల్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. ఆ సమయంలోనే
లోపల ఉన్న ఖైదీలంతా ఒక్కసారిగా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సిబ్బంది నుంచి తాళాలు లాక్కుని పలాయనం చిత్తగించారు. పరారైన 17 మంది ఖైదీల్లో ఇప్పటివరకూ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సహా తొమ్మిది మంది సిబ్బందిని జైళ్ల శాఖ డీజీపీ సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఖైదీల కోసం 17 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ఖైదీలు జరిపిన దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తంగపండి అనే పోలీసు తలకు తీవ్ర గాయమైంది. ఖైదీల పరారీ ఘటన నేపథ్యంలో పొరుగున ఉన్న మదురై, దిండిగల్ జిల్లాలతో పాటు కేరళలోని ఇడుక్కి జిల్లాలోనూ హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. ఒక్క దిండిగల్లోనే 16 ప్రాంతాల్లో చెక్పాయింట్లను ఏర్పాటు చేశారు. పరారైన ఖైదీల ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు చేరవేశారు. ప్రసార మాధ్యమాలలో కూడా వీటిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్లు (0)