కాలుష్య కోరల్లో గాజా

30 నిమిషాల క్రితం

Gaza
avatar
balaji

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

99 శాతం ప్రాంతం విషపూరితం

ఇజ్రాయిల్ దాడులతో పర్యావరణ విధ్వంసం
61 మిలియన్ టన్నుల శిథిలాలు..

87 శాతం వ్యవసాయ భూములు ధ్వంసం

దెబ్బతిన్న నీటి వనరులు, మురుగునీటి వ్యవస్థలు

ప్రజారోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం.. పునర్నిర్మాణానికి రూ.లక్షల కోట్లు అవసరం

ఆక్స్‌ఫామ్‌, సీఈఓబీఎస్‌ నివేదిక


న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ సైనిక దాడులు గాజాను మరో రూపంలోనూ చిన్నాభిన్నం చేశాయి. బాంబుల మోతతో భవనాలు నేలమట్టం కావడమే కాకుండా.. నేల, నీరు, గాలి విషతుల్యంగా మారుతున్నాయి. గాజాలోని 99 శాతానికి పైగా ప్రాంతాల్లో కాలుష్యానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టు ఆక్స్‌ఫామ్‌, బ్రిటన్‌కు చెందిన కాన్‌ఫ్లిక్ట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అబ్జర్వేటరీ (సీఈఓబీఎస్‌) సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యానికి, భవిష్యత్తు తరాల మనుగడకు తీవ్ర ముప్పుగా మారిందని హెచ్చరించింది. గాజాలో పర్యావరణ విధ్వంసాన్ని యుద్ధ నేరాల కోణంలో పరిశీలించాలని నివేదిక పేర్కొంది. 2023 అక్టోబర్‌ నుంచి ఇజ్రాయిల్‌ చేపట్టిన భూతల సైనిక చర్యలు గాజాలోని 78 శాతం భూభాగాన్ని ప్రభావితం చేశాయని ఉపగ్రహ చిత్రాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన నివేదిక తెలిపింది. పేలుడు పదార్థాల అవశేషాలు, భారీ లోహాలు, ఆస్బెస్టాస్‌, విష రసాయనాలు, వ్యాధికారక క్రిములు నేల, నీటిలో కలిసే ప్రమాదం ఉందని వివరించింది. అయితే ఇవి కాలుష్యానికి సంబంధించిన ప్రాథమిక సూచనలేనని, క్షేత్రస్థాయి పరీక్షలు అవసరమని స్పష్టం చేసింది.

ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అంచనా ప్రకారం.. గాజాలో 61 మిలియన్‌ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించడానికి 21 లక్షలకు పైగా ట్రక్కులు అవసరమవుతాయి. యుద్ధంలో 2 లక్షల టన్నులకు పైగా పేలుడు పదార్థాలు ఉపయోగించినట్టు నివేదిక పేర్కొంది. వీటి అవశేషాలతో పాటు కూలిన భవనాల నుంచి వెలువడే ఆస్బెస్టాస్‌, సిలికా ధూళి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారనున్నాయి.

నీటి సరఫరా వ్యవస్థ ఆందోళనకరం

నీటి సరఫరా వ్యవస్థ దుస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. యుద్ధానికి ముందు అందుబాటులో ఉన్న నీటితో పోలిస్తే ప్రస్తుతం సరఫరా 61 శాతం తగ్గింది. నీరు, పారిశుధ్య మౌలిక వసతుల్లో 85 శాతం దెబ్బతిన్నాయి. మురుగునీటి శుద్ధి కేంద్రాలన్నీ ధ్వంసమయ్యాయి. రోజుకు సుమారు 40 వేల ఘనపు మీటర్ల మురుగునీరు నేరుగా మధ్యధరా సముద్రంలో కలుస్తోంది. పంట భూముల్లో 87 శాతానికి పైగా దెబ్బతినగా, అందుబాటులో ఉండి సాగుకు పనికొచ్చే భూమి కేవలం 3 శాతమే మిగిలింది. లక్షలాది ఆలివ్‌ చెట్లు నేలమట్టమయ్యాయి.

ఇప్పటికే లక్షల కేసులు నమోదు

ఈ కాలుష్యం ప్రజారోగ్యంపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 19 లక్షలకు పైగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, 81 వేలకుపైగా తీవ్రమైన నీళ్ల విరేచనాల కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులో క్యాన్సర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

గాజా పునర్నిర్మాణానికి లక్షల కోట్లు అవసరం

గాజా పునర్నిర్మాణానికి వచ్చే పదేండ్లలో 71.4 బిలియన్‌ డాలర్లు అవసరమని ప్రపంచ బ్యాంకు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), ఐరాస అంచనా వేశాయి. అయితే కాలుష్య తీవ్రతపై క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించకుండా పునర్నిర్మాణ పనులు చేపట్టడం ప్రమాదకరమని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది. స్వతంత్ర పర్యావరణ నిపుణుల బృందాలను గాజాలోకి అనుమతించాలని, కాలుష్య నమూనాలను పరీక్షల కోసం బయటకు పంపేందుకు అవకాశం కల్పించాలని ఇజ్రాయిల్‌ను కోరింది.

మానవతా చట్టాల ఉల్లంఘనలపై తీవ్ర ప్రశ్నలు

పర్యావరణ విధ్వంసం అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదిక ఒక్కటే మారణహోమానికి సంబంధించిన అన్ని చట్టపరమైన అంశాలను నిర్ధారించలేదని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్