సౌరవ్ దాస్‌తో పాటు అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకాపైనా ఆంక్షలు
అనుమతి లేకుండా ముంబయిలో నిరసన చేపట్టారంటూ కేసు
ముంబయి : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలపై ముంబయి పోలీసులు కఠిన చర్యలకు దిగారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కో కన్వీనర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌పై లుకౌట్ సర్క్యులర్లు (ఎల్‌ఓసీ) జారీ చేశారు. వీరు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో ఈ చర్య తీసుకున్నట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి గురువారం వెల్లడించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ముంబయిలోని దాదర్ శివాజీ పార్కులో సీజేపీ ‘చలో ముంబయి’ పేరుతో నిరసన నిర్వహిం చింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలు జరుగుతు న్నాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఈ ఆందోళనలో డిమాండ్ చేశారు. సుమారు 4 వేల మందికి పైగా పాల్గొన్నారు. నటులు నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్ కూడా నిరసనలో పాల్గొన్నారు.
ఈ ఘటనపై అక్టోబర్ 3న పోలీసులు కేసు నమోదు చేశారు. సీజేపీ నేతలతో పాటు 400 మందికి పైగా మద్దతుదారులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 189, 223 సెక్షన్లతో పాటు మహారాష్ట్ర పోలీసు చట్టంలోని 37, 135 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడటం, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించడం వంటి అభియోగాలు మోపారు. సౌరవ్ దాస్ నవంబర్ 23న ఢిల్లీ విమానా శ్రయంలో యూకే వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఆయనపై లుకౌట్ సర్క్యులర్ నవంబర్ 22–23 రాత్రి జారీ చేసినట్టు కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ సర్క్యులర్ వివరాలను వెల్లడించాలని దాస్ తరఫు న్యాయవాది కోరినా కోర్టు అంగీకరించలేదు. మరోవైపు, జన్మస్థలాన్ని వివరించాలని చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం జారీ చేసిన నోటీసును కూడా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. కాగా, ఈ కేసుకు నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన కేసులతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆ కేసులను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. సౌరవ్ దాస్ ప్రయాణానికి సంబంధించిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.





కామెంట్‌లు (0)