Magazines

ప్రచారం ఘనం.. ఆచరణ శూన్యం

1 గంట క్రితం

implementation
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 4 నిమిషాల చదవడం

పరిశోధనా రంగంపై మోడీ సర్కారు తీరు

క్షేత్రస్థాయిలో నిధుల కొరత, ఫెలోషిప్‌ల జాప్యం

పీహెచ్‌డీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
బడ్జెట్‌ కేటాయింపులున్నా ఖర్చు కాని వైనం


న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ పరిశోధన రంగంలో అగ్రగామిగా నిలబెడతామంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిశోధకులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు పొంతనే లేదు. పరిశోధన, అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్ల భారీ నిధి ప్రకటించిన కేంద్రం.. మరోవైపు పీహెచ్‌డీ విద్యార్థులకు నెలల తరబడి ఫెలోషిప్‌లు అందించలేకపోతోంది. పరిశోధన ప్రాజెక్టులకు ఆమోదం లభించినా నిధులు విడుదల కావడం లేదు. ప్రయోగశాలల్లో పరికరాలు కొనుగోలు చేయడానికి, పరిశోధన సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రపంచస్థాయి పరిశోధనలంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న మోడీ సర్కారు.. యువ శాస్త్రవేత్తలకు కనీస ఆర్థిక భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవు తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫెలోషిప్‌లతో విద్యార్థుల అవస్థలు

కేంద్ర విశ్వవిద్యాలయాల్లో నెట్‌ ఫెలోషిప్‌ సాధించని ఎంఫిల్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు అందించే నాన్‌-నెట్‌ ఫెలోషిప్‌ నెలకు రూ.8 వేలు మాత్రమే. 2009లో నిర్ణయించిన ఈ మొత్తాన్ని ఇన్నేండ్లయినా పెంచకపోవడం పరిశోధకుల పట్ల కేంద్రానికి ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. జేఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ రూ.25 వేల నుంచి రూ.31 వేలకు, 2023 జనవరి నుంచి రూ.37 వేలకు పెరిగినా ప్రస్తుత జీవన వ్యయాలకు అనుగుణంగా లేదన్న ఆందోళన ఉంది. ఎస్‌ఆర్‌ఎఫ్‌ మొత్తం రూ.42 వేలకు చేరింది. మౌలానా ఆజాద్‌ జాతీయ ఫెలోషిప్‌ కింద లబ్ధి పొందుతున్న 1,400 మందికి పైగా విద్యార్థులకు 2025 జనవరి నుంచి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. 2022-23 నుంచి కొత్త దరఖాస్తులను కూడా నిలిపివేశారు. ఓబీసీ విద్యార్థుల జాతీయ ఫెలోషిప్‌ ఎంపిక జాబితాల విడుదలలోనూ జాప్యం జరిగింది. సామాజి కంగా వెనుకబడిన విద్యార్థులకు పరిశోధన అవకాశాలు కల్పించాల్సిన సమయంలో ఇలాం టి పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరం.

పరిశోధనలోకి వచ్చే దారులకూ అడ్డంకులు

ప్రాథమిక శాస్త్రాలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచిన కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై) ప్రవేశ పరీక్షను 2022లో రద్దు చేసి, ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని ఇన్‌స్పైర్‌లో విలీనం చేశారు. ఫెలోషిప్‌ల సంఖ్యను కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పినా, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆసక్తిని గుర్తించే ప్రత్యేక జాతీయ పరీక్షను మాత్రం తొలగించింది. గతేడాది డిసెంబర్‌లో యూజీసీ-నెట్‌ పరీక్షకు హాజరైన 7.35 లక్షల మందికిపైగా అభ్యర్థుల్లో 5,108 మందే జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విభాగానికి అర్హత సాధించారు. పరిశోధన రంగంలోకి రావాలనుకునే యువతకు అవకాశాలు ఎంత పరిమితంగా ఉన్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

'రోహిత్‌ వేముల ఘటనను విస్మరించలేం'

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల ఫెలోషిప్‌ను 2015 జులైలో నిలిపివేశారు. చనిపోవడానికి ముందు రాసిన లేఖలో ఏడు నెలలుగా

ఫెలోషిప్‌ అందలేదని పేర్కొన్నారు. 2016 జనవరిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కులవివక్ష, విద్యాసంస్థల్లో విద్యార్థుల పట్ల వ్యవహరించే తీరు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు ఈ ఘటనలో కీలకంగా నిలిచాయి. విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వాల బాధ్యతను ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోందని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు.

బడ్జెట్‌ కేటాయింపులూ నిరుపయోగమే

మోడీ ప్రభుత్వ పరిశోధన ప్రోత్సాహక పథకాల అమలులోనూ తీవ్ర లోపాలు బయటపడ్డాయి. 2025-26లో ప్రధానమంత్రి పరిశోధన ఫెలోషిప్‌ (పీఎంఆర్‌ఎఫ్‌)కు రూ.600 కోట్లు కేటాయించగా, 2026 జనవరి 31 నాటికి ఖర్చు చేసింది రూ.200 కోట్లు మాత్రమే. 3,688 మంది పరిశోధకులకు పూర్తి ఫెలోషిప్‌లు సకాలంలో అందేలా చూడాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. స్పార్క్‌ పథకానికి రూ.50 కోట్లు కేటాయించగా రూ.40 కోట్లే ఖర్చయ్యాయి. నిధులు కేటాయించామని చెప్పుకోవడమే తప్ప, వాటిని పరిశోధకులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి.

విద్యార్థులకు భరోసా ఏది?

ప్రయివేటు సంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్‌డీఐ) నిధిని ప్రకటించింది. అయితే ఇది నేరుగా పీహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించే పథకం కాదు. ప్రయివేటు రంగానికి పెట్టుబడులు అందించే ఆర్థిక వ్యవస్థ. మరోవైపు అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 2023-28 మధ్య రూ.50 వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారీ ప్రకటనలతోనే పరిశోధన అభివృద్ధి చెందదనీ, ఫెలోషిప్‌ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సకాలంలో డబ్బులు అందాలని మేధావులు సూచిస్తున్నారు. ప్రయోగశాలలకు నిధులు విడుదల కావాలనీ, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన వసతులు మెరుగుపడాలని చెప్తున్నారు. కానీ మోడీ సర్కారు ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యం, పరిశోధకుల సమస్యల పరిష్కారంలో కనిపించడం లేదు. ప్రపంచస్థాయి శాస్త్రీయ శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతామని చెప్పే కేంద్రం ముందున్న అసలు పరీక్ష ఇదేనని మేధావులు చెప్తున్నారు. లక్షల కోట్ల ప్రకటనలు కాదు.. పరిశోధకుల చేతికి సకాలంలో చేరే నిధులే దేశ శాస్త్రీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని వివరిస్తున్నారు.


ఆమోదం వస్తుంది..
నిధులు మాత్రం రావు

నిటి ఆయోగ్‌ ఈ ఏడాది మేలో విడుదల చేసిన నివేదిక పరిశోధన రంగంలోని అధికారిక జాప్యాలను బయటపెట్టింది. పరిశోధన ప్రతిపాదనలకు శాస్త్రీయ ఆమోదం లభించినా నిధుల విడుదలకు మూడు నుంచి ఆరు నెలలకు పైగా పడుతోందని పేర్కొంది. తొలి ఫెలోషిప్‌ వాయిదా అందడానికి నాలుగు నుంచి ఐదు నెలలు పడుతోందని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ప్రాజెక్టుల నిధులను వెనక్కి తీసుకుని, తిరిగి కేటాయించడానికి మరో రెండు మూడు నెలలు పడుతోందని వెల్లడించింది. పరిశోధకులు ప్రయోగాలు చేయాల్సిన సమయంలో తమకు రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.


జీడీపీలో పరిశోధన వ్యయం అరకొరే

2023-24లో భారత్‌ పరిశోధన, అభివృద్ధి రంగానికి రూ.2.45 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, జీడీపీలో దాని వాటా 0.84 శాతమే. ఉన్నత విద్యాసంస్థల వాటా 12.6 శాతం మాత్రమే. ప్రయివేటు రంగం నుంచి 51.8 శాతం నిధులు వస్తుండగా, ప్రయివేటు పరిశ్రమలు 45.2 శాతం పరిశోధనలు నిర్వహి స్తున్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రాథమిక పరిశోధనలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఆ దిశగా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు కనిపించడం లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్