హైకోర్టును ఆశ్రయించిన నేహా బోరా
రూ.10 వేల బాండ్ కట్టాలన్న పోలీసుల ఆదేశాలకు సవాల్
శాంతియుత నిరసనలను అణచివేసే చర్యగా అభ్యంతరం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళల్లో పాల్గొంటున్న ఎఐఎస్ఎ అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ పోలీసుల నోటీసు ఇచ్చారు. ఆ నోటీసును సవాల్ చేస్తూ నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కాలంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు పూచీకత్తు సమర్పించా లని పోలీసులు జారీ చేసిన నోటీసును ఆమె సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆమె తరపు న్యాయవాదులు కోరుతున్నారు.
నిరసనకు వెళ్తుండగా నిర్బంధం
అక్టోబరు 16న ఢిల్లీలోని మండి హౌస్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఆమెకు శాంతి బాండ్ నోటీసు జారీ చేశారు. అక్టోబరు 19న ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని, రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌తోపాటు ఒక పూచీకత్తు సమర్పించాలని అందులో పేర్కొన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సంబంధిత నిబంధనల ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు. అయితే, తనపై జారీ చేసిన నోటీసులో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాన్ని నిరూపించే ఆధారాలు లేవని నేహా బోరా వాదిస్తున్నారు.
నోటీసు అస్పష్టంగా ఉందని అభ్యంతరం
తనపై వచ్చిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, శాంతిభద్రతలకు ఎప్పుడు, ఏ సందర్భంలో భంగం కలిగే అవకాశం ఉందో నోటీసులో స్పష్టంగా పేర్కొనలేదని నేహా బోరా తన పిటిషన్‌లో తెలిపారు.మండి హౌస్ వద్ద శాంతియుత సమావేశానికి పిలుపునిస్తే, కన్నాట్ ప్లేస్‌లో జరిగిన నిరసనకు ప్రజలను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆరోపించడం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. జంతర్ మంతర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్టు చేసిన ఆరోపణల్లోనూ నిర్దిష్ట ఉత్తర్వులు, ఘటనల వివరాలు లేవని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలు శాంతియుత నిరసనలను అడ్డుకునేందుకు ముందస్తు అధికారాలను దుర్వినియోగం చేయడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవి రాజ్యాంగంలోని 19(1)(ఎ), 19(1)(బి), 21 అధికరణాల కింద కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగిస్తాయని వాదించారు. ఈ నేపథ్యంలో పోలీసుల నోటీసును రద్దు చేయాలని, దాని ఆధారంగా తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును నేహా బోరా కోరారు. దసరా సెలవుల కారణంగా ఢిల్లీ హైకోర్టు మూసి ఉండటంతో అత్యవసర విచారణ కోసం ఆమె తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.






కామెంట్‌లు (0)