రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి
ఆర్ఎస్ఎస్, బీజేపీల భావజాలంతో దేశంలో విభజన తీవ్రం
ఈ రెండింటిని నిర్మూలించే వరకు శాంతి ఉండదు : ఏఐసీసీ చీఫ్ ఖర్గే
పాట్నా: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వెంటనే నిలిపివేసి, అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కోరారు. గత రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను "రెండో స్వాతంత్య్ర యుద్ధం"గా భివర్ణించారు. పశ్చిమ బెం గాల్, హర్యానా, బీహార్, మహారాష్ట్రలో 'ఓట్ల చోరీ' ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని, ఈ దొంగలందరినీ జైలుకు పంపిస్తామని అన్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి, తమ హక్కుల కోసం పోరాడాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం నుంచి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని పేర్కొన్నారు. బీహార్ తొలి ముఖ్యమంత్రి డాక్టర్ కృష్ణ సింగ్ 139వ జయంతి ఉత్సవాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల భావజాలం దేశంలో విభజనలను మరింత తీవ్రతరం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నిర్మూలించే వరకు దేశంలో శాంతి ఉండదని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ వంటి సోషలిస్ట్ నాయకులు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోందన్నారు.
"నేడు మనం ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే ప్రజలు దానిని భిన్నంగా అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నంత కాలం, శాంతి ఉండదు. మేము ఐక్యత, సమానత్వం, రాజ్యాంగాన్ని విశ్వసించే దేశభక్తులం. బీజేపీ నాయకుల్లా రాజకీయ లబ్ధి కోసం మన ప్రజలను విభజించేవాళ్లం కాదు." అని అన్నారు.హల్ద్వానీ 'శుద్ధీకరణ' చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. కుల వివక్ష, వెలివేత వంటివి మానవ గౌరవాన్ని, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి ఆలయంలోకి దళితులు ప్రవేశించేందుకు, అక్కడ పూజలు చేసుకునేందుకు వారికి పూర్తి హక్కు ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. "మా పోరాటం మతానికి వ్యతిరేకం కాదు. మతం పేరుతో జరిగే వివక్షకు వ్యతిరేకం. నా మతం పట్ల నాకు గర్వం ఉంది. నా పేరు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకదాని నుంచి ప్రేరణ పొందిందే. మతం ప్రజలను ఏకం చేయాలి, విభజించకూడదు." అని అన్నారు. అయోధ్యలోని రామమందిరానికి అందిన విరాళాల వివాదంపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు ఖర్గే. రాముడు తన కండ్లు తెరిచి, తన పేరుతో సంపదను దోచుకున్న వారికి తగిన శిక్ష విధించాలని ఆయనను ప్రార్థిస్తున్నానని అన్నారు.
బీహార్ తొలి ముఖ్యమంత్రి కృష్ణ సింగ్ వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, నీటిపారుదల రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఆధునిక రాష్ట్రానికి పునాదులు వేయడంలో సహాయపడ్డారని ఖర్గే అన్నారు. "జమీందారీ వ్యవస్థను రద్దు చేసి, బలహీన వర్గాలకు సాధికారత కల్పించడం ద్వారా సింగ్ ఆధునిక బీహార్‌లో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేశారు. తన వర్గానికి చెందిన వారే అనేకమంది భూస్వాములుగా ఉన్నప్పటికీ, ఆయన దేశానికి, పేదలకు సేవ చేయడానికే కట్టుబడి ఉన్నారు. ఆధునిక బీహార్ నిర్మాతగా ఆయన వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, నీటిపారుదల రంగాలకు గణనీయమైన కృషి చేశారు. బరౌని ఆయిల్ రిఫైనరీ, ఎరువుల కర్మాగారాలు, రాజేంద్ర సేతు వంటి అనేక మైలురాయి ప్రాజెక్టులు ఆయన హయాంలో స్థాపించారు. ఆ సమయంలో చాలా మంది విదేశీ ఆర్థికవేత్తలు బీహార్‌ను దేశంలోనే అత్యుత్తమ పరిపాలన కలిగిన రాష్ట్రంగా పరిగణించారు. ఇప్పుడు అది జంగిల్ రాజ్‌లా మారిపోయింది." అని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.






కామెంట్లు (0)