Magazines

త్వరలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు!

1 గంట క్రితం

parliamentary session
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ బిల్లుల ఆమోదానికే

​డీఎంకే, చిన్న పార్టీల మద్దతు కోసం కేంద్రం ప్రయత్నాలు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముంది. ఈ బిల్లులకు అవసరమైన మద్దతు కూడగట్టగలమనే ధీమాతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న లోక్‌సభలో ఈ బిల్లులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తాజాగా మరోసారి ఈ బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చి ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇందుకోసం డీఎంకేతో పాటు కొన్ని చిన్న పార్టీలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

డీఎంకే మద్దతుపై ఆశలు

తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకున్న డీఎంకే మద్దతును కూడగట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 22 మంది ఎంపీలున్న డీఎంకే.. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీల్లో ఒకటి. అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీ మద్దతు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరికొన్ని చిన్న పార్టీలతోనూ చర్చలు సాగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఇంకా ముగియని వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసినప్పటికీ, వాటికి అధికారికంగా ప్రొరోగేషన్‌ (సమావేశాల ముగింపు ప్రకటన) ఇవ్వలేదు. ఈ పరిణామం కూడా తక్కువ వ్యవధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలకు దోహదం చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో పార్లమెంటు ప్రాంగణంలోని సంవిధాన్‌ సదన్‌లో 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయిస్తే ఎంపీలకు దాదాపు వారం రోజుల ముందుగానే సమాచారం ఇచ్చే అవకాశముందని తెలిపింది. అయితే, ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్