ఏకపక్ష నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి
ఆయన చర్యలు రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలి
న్యాయ విచారణ కమిషన్ లేదా సిట్ ఏర్పాటు చేయాలి : జ్ఞానేశ్ కుమార్, మనీష్ గార్గ్, సీమా ఖన్నాను ప్రాసిక్యూట్ చేయాలి
సర్, 13 కోట్ల ఓటర్ల తొలగింపు నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరాలు
ఫారం-6 మార్పులు, ఓటర్ల జాబితా డేటా కేంద్రీకరణపైనా ప్రశ్నలు
సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ఓటర్ల హక్కులపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. విధి నిర్వహణలో వైఫల్యం, నిర్లక్ష్యానికిగాను 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32 కింద జ్ఞానేశ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నాను ప్రాసిక్యూట్ చేయాలని కోరారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో జ్ఞానేష్ కుమార్.. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా లేదా మెజారిటీ అభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, ఆదేశాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ 2023 చట్టంలోని సెక్షన్ 18లో ఉన్న నిబంధనలను పిటిషన్ ప్రస్తావించారు.
ఫారం-6లో మార్పులపై అభ్యంతరాలు
కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో మార్పులు చేయడంపై కూడా పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆన్‌లైన్ పోర్టల్‌లో మార్పులు చేసినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టబద్ధంగా నిర్దేశించిన ఫారం-6ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టును కోరారు. కీలక నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సంధూ, వివేక్ జోషిని సంప్రదించకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు.







కామెంట్‌లు (0)