ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి మహిళా సంఘాల మార్చ్
పోలీసుల లైంగిక వేధింపుల ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నిరసనకారుల పట్ల డీసీపీ అవహేళన వ్యాఖ్యలు
ఆందోళనను ఉధృతం చేసిన ఆందోళనకారులు
క్షమాపణలు చెప్పిన డిప్యూటీ పోలీస్ కమిషనర్
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లపై పోలీసుల లైంగిక వేధింపుల ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి మార్చ్ నిర్వహించారు.ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఎఐపీడబ్ల్యూఎ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మార్చ్లో నిరసనకారులు ప్లకార్డులు చేతబూని లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాల హోరెత్తించారు. ఈ ప్రదర్శనకు ఐద్వా అధ్యక్షురాలు పికె శ్రీమతి టీచర్, ఉపాధ్యక్షురాలు మరియం ధావలే, సీఐటీయూ అనుబంధ వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎఆర్ సింధు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకురాలు ఆనీ రాజా, ఎఐపీడబ్ల్యూఎ జాతీయ కార్యదర్శి శ్వేతా రాజ్ తదితరులు నాయకత్వం వహించారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర జాయింట్ కార్యదర్శి మెహినా ఫాతిమా నేతృత్వంలో విద్యార్థినులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలూ పాల్గొన్నారు.అనంతరం పోలీస్ ప్రధాన కార్యాలయానికి మార్చ్ చేరుకోగా బయటకు వచ్చిన డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ)... నిరసనకారులు ఫొటోలు తీసుకుని వెళ్లిపోవచ్చంటూ అవహేళన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. చివరకు డీసీపీ క్షమాపణ చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. పోలీస్స్టేషన్కు చేరుకున్న మహిళా సంఘాల నాయకులు లైంగిక వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీకి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






కామెంట్లు (0)