50 వేల మంది మహిళా కార్మికుల భాగస్వామ్యం
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కనీస వేతనం రూ.42 వేలు,
సార్వత్రిక పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలి : సీఐటీయూ నేతల డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కార్మికుల హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలనీ, సార్వత్రిక పెన్షన్‌ను రూ. 21 వేలకు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా లక్ష మంది కార్మికులతో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్టు సీఐటీయూ నేతలు పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు ఢిల్లీకి తరలివచ్చి ఈ ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు.
ఆశా, అంగన్‌వాడీ తదితర పథకాల్లో పని చేస్తున్న వారిని అన్ని హక్కులు, ప్రయోజనాలు కలిగిన కార్మికులుగా గుర్తించాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలనీ, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించడంతో పాటు నీరు, భూమి, అడవులను పరిరక్షించాలనీ, సర్‌ను రద్దు చేయాలనీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కోరారు.2019-2020లో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంటులో ఆమోదించిందని ఈ సందర్భంగా ఎలమరం కరీం విమర్శించారు. వామపక్ష పార్టీలు, ఇతర ప్రతిపక్షాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అప్పటి నుంచి బీఎంఎస్ మినహా మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 12న 35 కోట్ల మంది కార్మికులతో దేశవ్యాప్త సమ్మె నిర్వహించినా కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.





కామెంట్‌లు (0)