Magazines

దళిత అయ్యప్ప స్వాముల పట్ల కుల వివక్ష

17 నిమిషాల క్రితం

టి స్కైలాబ్ బాబు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 2 నిమిషాల చదవడం

గుడికి తాళం వేసిన అగ్రకుల స్వాములను తక్షణమే అరెస్ట్ చేయాలి

పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

అయ్యప్ప స్వామి మాలలు ధరించి పవిత్రంగా జీవిస్తున్న దళిత అయ్యప్ప స్వాముల పట్ల కుల వివక్ష పాటించి వారిని గుడిలోకి రానివ్వకుండా తాళం వేసిన అగ్రకుల స్వాములను తక్షణమే అరెస్టు చేయాలనీ, వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో దళిత అయ్యప్ప స్వాములు కుల వివక్షకు గురయ్యారని తెలిపరు. అయ్యప్ప స్వామి మాలలో కూడా ఈ అమానుషకుల వివక్ష ఏమిటని ఆయన ప్రశ్నించారు. గత 30 సంవత్సరాలుగా దళితులు సైతం అయ్యప్ప స్వామి మాలలు వేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది అగ్ర కులాలకు చెందిన అయ్యప్ప స్వాములు దళిత స్వాములతో కలిసి పూజ, బిక్ష తదితర కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయానికి తాళం వేసుకొని దళిత అయ్యప్ప స్వాములను గుడిలోకి రాకుండా కుల వివక్ష అంటరానితనం పాటిస్తూ అవమానించారని తెలిపారు. అగ్రకుల అయ్యప్ప స్వాములు గుడికి తాళం వేయడంతో చేసేదేంలేక ప్లాస్టిక్ కవర్లతో ప్రత్యేకంగా ఒక గుడి ఆవరణను దళితులు నిర్మించుకొని పూజ భిక్ష చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి మాలలు ధరించే ముందే గ్రామ సర్పంచులు, సీనియర్ గురు స్వాములను అడిగి మాలలు ధరించారని చెప్పారు.

గ్రామ సర్పంచ్ తాను గ్రామానికి సర్పంచ్ ను కానీ బిక్షకు, పూజకు కాదని చెప్పడం సరైనది కాదని తప్పుపట్టారు. సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి కులవక్ష పాటించిన వారిపై అట్రాసిటీ కేసులతో పాటు ఇతర కేసులను నమోదు చేయాలని స్కైలాబ్ బాబు కోరారు. దేవుడు అందరికీ సమానమని చెప్పే నేటి సమాజంలో దళితులు గుడికి వస్తేనే తాళం వేసుకునే దుస్థితి ఈ సమాజంలో నెలకొనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు బంధువులు అని రోజు ప్రగల్బాలు పలికే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు అయ్యప్ప స్వామి మాలలో జరిగిన కుల వివక్ష కనపడలేదా అని ప్రశ్నించారు. కులవివక్షను అంటరానితనాన్ని, కుల వ్యవస్థను బలపరిచే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వైఖరి ఉందని విమర్శించారు. అయ్యప్ప స్వామి మాలలో జరిగిన కుల వివక్షను పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. వివక్ష పాటించిన పెత్తందారులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్