గ్లోబల్ సమ్మిట్‌లో 1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అగ్రి ఎక్స్పో
వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఐదు సెషన్లు : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగంలో ప్రపంచస్థాయి పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌లో 1,904 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక అగ్రి ఎక్స్పో నిర్వహిస్తామనీ, వ్యవసాయ రంగానికి ఐదు ప్రత్యేక సెషన్లు ఉంటాయని ప్రకటించారు. వ్యవసాయం, ఎరువులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎఫ్ఎంసీజీ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవ సాయం, ఎరువులు, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. విత్తనోత్పత్తి, నూతన తరం ఎరువులు, వ్యవసాయ సాంకేతికత, యాంత్రీకరణ, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, శీతల గిడ్డంగుల వ్యవస్థ, ఎఫ్ఎంసీజీ తయారీ, ఎగుమతులు వంటి రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు.
ముడి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా మార్చి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ పరిశ్రమ లను అభివృద్ధి చేయాల్సిన అవసరముంద న్నారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతా యని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో ‘పెట్టుబడి హామీ నుంచి ఉత్పత్తి వరకు’ గురించి మంత్రి వివరించారు. పెట్టుబడుల ప్రకటనలు కేవలం అవగాహన ఒప్పందాలకే పరిమితం కాకుండా, భూమి కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, తెలంగాణలోనే తయారైన ఉత్పత్తుల మార్కె టింగ్ వరకు కార్యరూపం దాల్చాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. పెట్టుబడిదారులు స్పష్టమైన పెట్టుబడి ప్రతిపా దనలు, అవగాహన ఒప్పందాలతో గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు.
గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి నూతన దిశానిర్దేశం చేసే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హాకా ఎమ్డీ చంద్రశేఖర్ రెడ్డి, సీడ్ సర్టిఫికేషన్ అథారిటి డైరెక్టర్ కిరణ్ కుమార్, ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరి కృష్ణ ఆదిత్య, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటి డైరెక్టర్ సుష్మ, పాల్గొన్నారు.






కామెంట్లు (0)