డబుల్ ఇంజిన్ సర్కార్ల తీరిది
మహారాష్ర్టలో ఆయన కంపెనీకి రూ.225 కోట్ల పర్యావరణ రాయితీ
ప్రాజెక్టు వ్యయం 99 శాతం తగ్గింపు
రూ.5,675 కోట్ల నుంచి రూ.56.75 కోట్లకు కుదింపు
వన్యప్రాణుల సంరక్షణ నిధి రూ.227 కోట్ల నుంచి రూ.2.27 కోట్లకు తగ్గుదల
కంపెనీ అఫిడవిట్‌కు మహారాష్ట్ర అటవీ శాఖ ఆమోదం
విస్తుపోతున్న పర్యావరణవేత్తలు
బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి అదే తీరును ప్రదర్శించింది. మోడీకి సన్నిహిత పారిశ్రామికవేత్తగా పేరున్న అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ మహారాష్ట్రలో చేపట్టనున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా 99 శాతం తగ్గించింది. దానితో తొలుత నిర్ణయించిన వన్యప్రాణుల సంరక్షణ నిధి రూ.5,675 కోట్లను రూ.56.75 కోట్లకు కుదించేసింది. దీనిపై అదానీ సంస్థ సమర్పించిన అఫిడవిట్‌ను మహారాష్ట్ర అటవీ శాఖ ఆమోదించింది. దీంతో సహ్యాద్రి పులుల సంరక్షణ కేంద్రానికి చేరాల్సిన రూ.227 కోట్ల నిధి కాస్తా రూ.2.27 కోట్లకు పరిమితమైంది. అస్మదీయుల వ్యాపార సామ్రాజ్యం ఎలా విస్తరణ అవుతుందో చెప్పేందుకు ఇదో తాజా ఉదాహరణ.
ముంబయి: కార్పొరేట్ ప్రయోజనాల ముందు పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ నిబంధనలు బలహీనపడుతున్నాయి. దేశవ్యాప్తం గా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊదర గొడుతున్న బీజేపీ అసలు రంగు మరింత బాహటం గా వెల్లడవుతుంది. అస్మదీయులకు ప్రకృతి సంపదను దోచిపెట్టడం, తద్వారా కార్పొరేట్ల అను కూల నిర్ణయాలను మరింత వేగంగా అమలు ఎలా చేసుకోవచ్చో ‘అదానీ’ వ్యవహారం బట్టబయలు చేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉన్న మహారాష్ర్టలో అదానీ గ్రీన్ ఎనర్జీ మహారాష్ట్ర ప్రాజెక్టు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సంస్థకు చెందిన ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా వందో వంతుకు తగ్గించుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమవంతు సహకారాన్ని అందించాయి.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1,500 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ గ్రీన్ ఎనర్జీ తారళి పంప్డ్ స్టోరేజ్ జలవిద్యుత్ ప్రాజెక్టును చేపడుతోంది. పటాన్ తాలూకాలోని తారళి డ్యామ్ జలాశయంపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టు నాలుగు గ్రామాల్లో 150.74 హెక్టార్ల భూమిలో విస్తరించనుంది. ఈ ప్రాంతం కొయినా వన్యప్రాణి అభయారణ్యానికి చెందిన బఫర్ ప్రాంతం, పరిగణనలో ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ (పర్యావరణ సున్నిత ప్రాంతం) పరిధిలో ఉంది. ఇది సహ్యాద్రి పులుల సంరక్షణ కేంద్రంలో భాగం కావడం గమనార్హం.
రూ.227 కోట్ల సంరక్షణ నిధి నిబంధన
గతేడాది ఫిబ్రవరి 11న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ జారీ చేసిన పర్యావరణ అనుమతి సిఫారసు లేఖలో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5,675 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న సమావేశమైన రాష్ట్ర వన్యప్రాణి మండలి 15 షరతులు విధించింది.
వాటిలో ప్రాజెక్టు వ్యయంలో నాలుగు శాతాన్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం సహ్యాద్రి పులుల సంరక్షణ కేంద్రం ఖాతాలో జమ చేయాలన్నది కీలకమైనది. ఈ లెక్కన అదానీ సంస్థ రూ.227 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
ఆమోదించిన మహారాష్ట్ర అటవీ శాఖ
ఆశ్చర్యకరంగా మహారాష్ట్ర అటవీ శాఖ ఈ అఫిడవిట్‌ను ఆమోదించింది. అక్టోబర్ 12న జారీ చేసిన లేఖలో సవరించిన వ్యయంలో ఒక శాతం కింద రూ.56.75 లక్షలు వెంటనే చెల్లించాలనీ, మిగిలిన మూడు శాతం రూ.1.70 కోట్లు జాతీయ వన్యప్రాణి మండలి అనుమతి తర్వాత చెల్లించాలని సూచించింది. దీంతో తొలుత రూ.227 కోట్లుగా ఉన్న సంరక్షణ నిధి రూ.2.27 కోట్లకు పడిపోయింది. ఇప్పటికే అదానీ గ్రూపు రూ.56.75 లక్షలు జమ చేసినట్టు సహ్యాద్రి పులుల సంరక్షణ కేంద్రం ఫీల్డ్ డైరెక్టర్ ధ్రువీకరించారు.
ప్రభుత్వాల తీరుపై అనుమానాలు
ఒక భారీ ప్రాజెక్టు వ్యయాన్ని 99 శాతం తగ్గించడంపై సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణకు అందాల్సిన దాదాపు రూ.225 కోట్ల నిధి తగ్గిపోయింది. బీజేపీ పాలిత మహారాష్ట్రలోని అటవీ శాఖ ఇంతటి కీలకమైన వ్యయ సవరణను ఏ ప్రాతిపదికన ఆమోదించిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు ఇలాంటి భారీ వెసులుబాటు కల్పించడంలో 'డబుల్ ఇంజిన్ సర్కారు' బాధ్యత ఏమిటన్న చర్చ కూడా మొదలైంది.
ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
ఈ వ్యవహారంపై సతారా జిల్లావన్యప్రాణి సంరక్షకుడు రోహన్ భాటే అక్టోబర్ 30న ప్రధానమంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇంత పెద్ద విద్యుత్ ప్రాజెక్టును రూ.56.75 కోట్లతో నిర్మించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో నాలుగు శాతం సంరక్షణ నిధిగా చెల్లించాల్సి ఉండగా, సంస్థకు అనూహ్యంగా భారీ మినహాయింపు లభించిందని గుర్తుచేశారు. నిర్ణయాన్ని రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రం, రాష్ట్రం విచారణకు ఆదేశం
ఫిర్యాదుపై నవంబర్ 5న కొయినా అభయారణ్యం ఉప సంచాలకుడిని విచారణకు ఆదేశించారు. మరుసటి రోజు నవంబర్ 6న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కూడా మహారాష్ట్ర అటవీ శాఖను ప్రాధాన్యత ప్రాతిపదికన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర అటవీ శాఖ కూడా విచారణ ప్రారంభించింది.
వ్యయ తగ్గింపుపై అదానీ మౌనం
మరోవైపు, ప్రాజెక్టులోని నిర్మాణాలన్నీ ప్రయివేటు భూముల్లోనే ఉన్నాయనీ, అటవీ భూమి వినియోగం లేదని అదానీ గ్రూపు వివరణ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్వహణ వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు, వన్యప్రాణులకు హాని ఉండదని పేర్కొంది. అయితే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.5,675 కోట్ల నుంచి రూ.56.75 కోట్లకు ఎందుకు తగ్గించారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.
తేలాల్సిన కీలక ప్రశ్నలు
ప్రాజెక్టుకు ఇంకా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అదానీ సంస్థ సమర్పించిన అఫిడవిట్‌ను ఏ ప్రాతిపదికన ఆమోదించారు? అసలు ప్రాజెక్టు వ్యయం ఎంత? పర్యావరణ పరిరక్షణకు కేటాయించాల్సిన నిధి ఎందుకు తగ్గింది? ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందింది ఎవరు? అన్న ప్రశ్నలకు విచారణలో స్పష్టమైన సమాధానాలు రావాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసం పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాలకు తిలోదకాలు ఇవ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
అఫిడవిట్‌తో వందో వంతుకు వ్యయం
అయితే ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ కొత్త లెక్కతో ముందుకొచ్చింది. సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నరేశ్ తెల్గు సెప్టెంబర్ 8న సమర్పించిన నోటరీ అఫిడవిట్‌లో ప్రాజెక్టు వ్యయం రూ.56.75 కోట్లేనని పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్టు వ్యయాన్ని పోలిక ఆధారిత అంచనాతో లెక్కించామనీ, సవరించిన మొత్తాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో అదానీ కొత్త లెక్కలు కొత్త ప్రశ్నలను ముందుకు తీసుకొచ్చాయి.






కామెంట్‌లు (0)