ఆదాయంలో 65 శాతం ఖర్చులకే
18.3 శాతం వడ్డీకి ప్రయివేటు అప్పులు
అప్పుల ఊబిలో పల్లె కుటుంబాలు
ఆర్థిక భారం మోయలేక సతమతం
గ్రామీణ ఆర్థిక పరిస్థితిపై నాబార్డ్ సర్వేలో వెల్లడైన చేదు నిజాలు
దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. గ్రామీణ కుటుంబాల బతుకులు మాత్రం భారంగా మారుతున్నాయి. పెరుగుతున్న ధరలు, పరిమిత ఆదాయాలు, తగ్గుతున్న పొదుపులు పల్లె ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికే ఆదాయం సరిపోని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నాబార్డ్ తాజా సర్వేలో వెల్లడైన గణాంకాలు గ్రామీణ ప్రజల ఆర్థిక కష్టాలకు అద్దం పడుతున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అభివృద్ధి, ఆర్థిక ప్రగతి అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ గ్రామీణ భారతంలో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆదాయాల్లో పెద్దగా మార్పు లేకపోవడం, పొదుపు సామర్థ్యం పడిపోవడంతో పల్లె ప్రజలు అప్పులపై ఆధారప డాల్సి వస్తోంది. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభి వృద్ధి బ్యాంకు (నాబార్డ్) నిర్వహించిన తాజా సర్వే ఈ పరిస్థితిని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, జమ్మూకాశ్మీ ర్లోని 600 గ్రామాల్లో 6 వేల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. సెప్టెంబర్లో గ్రామీణ ద్రవ్యోల్బ ణం 6.08 శాతానికి చేరింది. ఆగస్టులో 5.24 శాతం, జులైలో 4.84 శాతంగా నమోదైంది.
అంటే గ్రామీణ ప్రాంతాల్లో ధరల భారం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కుటుంబాల కొనుగోలు శక్తి దెబ్బతింటోంది.
ఆదాయం పెరిగింది కొద్దిమందికే
గత ఏడాదిలో ఆదాయం పెరిగిందని 27.1 శాతం కుటుంబాలే చెప్పాయి. నాబార్డ్ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యల్పమవటం గమనార్హం. గతేడాది నవంబర్లో ఈ సంఖ్య 42.2 శాతంగా ఉంది. మరోవైపు 20.5 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. 52.4 శాతం కుటుంబాల ఆదాయంలో ఎలాంటి మార్పూ లేదు. ఆదాయం పెరిగిన కుటుంబాల్లోనూ సగటు పెరుగుదల 10.5 శాతానికే పరిమితమైంది. ధరలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఆదాయాలు పెరగడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
పొదుపునకు అవకాశం ఏది?
గ్రామీణ కుటుంబాల ఆదాయంలో పొదుపు వాటా చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం నెలవారీ ఆదాయంలో 12.6 శాతం మాత్రమే పొదుపు చేస్తున్నారు. 2024 సెప్టెంబర్లో ఇది 16.8 శాతంగా ఉండేది. వచ్చిన ఆదాయంలో 65 శాతం నిత్యావసరాలు, ఇతర వినియోగ ఖర్చులకే వెచ్చిస్తున్నారు. మరో 13.2 శాతం రుణాల చెల్లింపులకు పోతోంది. తమ ఆర్థిక పొదుపు తగ్గిందని 32.1 శాతం కుటుంబాలు వెల్లడించాయి. పెట్టుబడులు తగ్గిన కుటుంబాల వాటా కూడా సర్వేలో అత్యధికంగా 20.2 శాతానికి చేరింది.
ఆహారానికే ఆదాయంలో సగం
కుటుంబాల నెలవారీ వినియోగ ఖర్చుల్లో ఆహారానికే 53.5 శాతం వెచ్చిస్తున్నారు. విద్య, వైద్యానికి 24.1 శాతం, వంటగ్యాస్, రవాణా వంటి ఇంధన అవసరాలకు 16.6 శాతం ఖర్చవుతోంది. ధరల ఒత్తిడి మరింత పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో ధరలు 5 శాతం, ఏడాదిలో 5.9 శాతం పెరుగుతాయన్న అంచనాలున్నాయి. సామాన్యులపై ధరల భారం తగ్గించాల్సిన ప్రభుత్వానికి ఈ పరిస్థితి సవాలుగా మారుతోంది.
సంక్షేమ సాయం వాటా తగ్గుముఖం
ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక బదిలీలు గ్రామీణ కుటుంబాల నెలవారీ ఆదాయంలో సగటున 8.3 శాతంగా ఉన్నాయి. ఏడాది క్రితం ఈ వాటా 9.3 శాతంగా ఉండేది. పీఎం కిసాన్, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి పథకాల ద్వారా సాయం అందుతున్నప్పటికీ.. కుటుంబాల మొత్తం ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు ఆ సాయం సరిపోవడం లేదనే పరిస్థితి కనిపిస్తోంది.
భవిష్యత్తుపై తగ్గుతున్న భరోసా
వచ్చే ఏడాదిలో ఆదాయం పెరుగుతుందని 67.9 శాతం కుటుంబాలు ఆశిస్తున్నాయి. అయితే ఉద్యోగాల విషయంలో ఆశావాదం గత సర్వేలతో పోలిస్తే తగ్గింది. ఉద్యోగ పరిస్థితులు మెరుగు పడతాయని లేదా యథాతథంగా ఉంటాయని 94.8 శాతం మంది భావిస్తున్నారు. గ్రామీణా భివృద్ధిలో రహదారులకు 45.3 శాతం కుటుంబా లు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. విద్య, విద్యుత్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. దేశ ఆర్థికాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, గ్రామీణ కుటుంబాలు ఎదుర్కొం టున్న వాస్తవ ఆర్థిక పరిస్థితులకు మధ్య అంతరం కనిపిస్తోంది. ఆదాయం పెరగక, ఖర్చులు తగ్గక, పొదుపు కరువై, అప్పుల భారం పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నాబార్డ్ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అప్పులే దిక్కవుతున్నాయి
ధరల పెరుగుదల, ఆదాయాల స్తబ్ధతతో గ్రామీణ కుటుంబాలు అప్పుల బాట పడుతున్నాయి. అప్పులు పెరిగాయని చెప్పిన కుటుంబాల వాటా జులైలో 28.7 శాతం ఉండగా, తాజా సర్వేలో 32.4 శాతానికి చేరింది. 22.1 శాతం కుటుంబాలు ప్రయివేటు వ్యక్తులు, ఇతర అనధికారిక మార్గాల నుంచి రుణాలు తీసుకుంటున్నాయి. ఇలాంటి అప్పులపై సగటు వార్షిక వడ్డీ 18.3 శాతంగా ఉంది. కొందరు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందుబాటులో ఉన్నాయనే ప్రచారానికి భిన్నంగా.. గ్రామీణ కుటుంబాల్లో ఒక వర్గం అధిక వడ్డీ భారాన్ని మోస్తోంది.







కామెంట్లు (0)