నెయ్యి, వెన్న నుంచి డ్రైఫ్రూట్స్ వరకు మోత..
న్యూఢిల్లీ : ఈ ఏడాది దీపావళి పండుగ సంబరాలు సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టనున్నాయి. పండుగ మిఠాయిల తయారీకి కీలకమైన నెయ్యి, వెన్న, పాల ఉత్పత్తులతో పాటు డ్రైఫ్రూట్స్ ధరలు భారీగా పెరగడంతో ఇంటింటా పండుగ ఖర్చు పెరిగింది. కొన్ని రకాల పిస్తా ధరలు గత దీపావళితో పోలిస్తే ఏకంగా 70 శాతం వరకు ఎగబాకాయి. మరోవైపు మిఠాయిలు, గిఫ్ట్ హ్యాంపర్ల తయారీ వ్యయాలు కనీసం 15 శాతం పెరగడంతో కార్పొరేట్ సంస్థలు సైతం పండుగ కానుకల బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు పండుగ కొనుగోళ్ల భారం వినియోగదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.
కార్పొరేట్ గిప్టులకు కోత..
ముడిసరుకులు, ప్యాకేజింగ్ వ్యయాలు పెరగ డంతో మిఠాయిలు, ప్రీమియం గిఫ్ట్ పర్ల ధరలు కనీసం 15 శాతం పెరిగాయి. దీంతో ఫార్మా, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసిజి సహా పలు రంగాల కంపెనీలు ఉద్యోగులు, ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములకు ఇచ్చే దీపావళి కానుకల జాబితాను కుదించుకుంటున్నాయి. పెద్ద బహుమతి ప్యాకేజీల కు బదులుగా చిన్న ప్యాకేజీలను ఎంచుకుంటు న్నాయి. కార్పొరేట్ గిఫ్టింగ్ ద్వారా భారీ ఆర్డర్లు పొందే మిఠాయి తయారీ, ప్యాకేజింగ్ సంస్థలపైనా ఈ పరిణామం ప్రభావం చూపుతోంది.
ద్రవ్యోల్బణం మరింత కోరలు..
పండుగ కొనుగోళ్లకు ముందే ధరల ఒత్తిడి పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి చేరడంతో మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగింది.
చక్కెర, మిఠాయిల ధరల ద్రవ్యోల్బణం ఆగస్టులో 10.9 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌లో 13.8 శాతానికి ఎగబాకింది. చక్కెర ధరల పెరుగుదల కూడా ఇదే కాలంలో 24.3 శాతం నుంచి 29.8 శాతానికి చేరింది. వినియోగదారుల ధరల సూచీలోని 37 శాతం వస్తువుల ధరలు ఆగస్టులో 4 శాతానికి మించి పెరిగినట్లు ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. మార్చిలో ఈ వాటా 20 శాతంగా ఉంది. అంటే ధరల పెరుగుదల కొన్ని వస్తువులకే పరిమితం కాకుండా మరింత విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పండుగ అవసరాల కోసం కొనుగోళ్లు చేయడం సామాన్య కుటుంబాల బడ్జెట్‌పై మరింత భారంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాల ఉత్పత్తుల ధరలు పెంపు..
పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడం, సరఫరా పరిమితులు వంటి కారణాలతో అముల్, కర్ణాటకకు చెందిన నందిని, తమిళనాడులోని ఆవిన్ డెయిరీ సంస్థలు పలు ఉత్పత్తుల ధరలను పెంచాయి. అముల్ కిలో నెయ్యి కార్టన్ ధర రూ.630 నుంచి రూ.680కి, 500 గ్రాముల ప్యాక్ ధర రూ.325 నుంచి రూ.345కి చేరింది. 100 గ్రాముల వెన్న ప్యాక్ ధర రూ.63 నుంచి రూ.66కు, 500 గ్రాముల ప్యాక్ రూ.310 నుంచి రూ.325కు పెరిగింది. ఆన్‌లైన్ విక్రయ వేదికల్లో లీటరు నెయ్యి ధర రూ.700 నుంచి రూ.740 వరకు పలుకుతోంది. డ్రైఫ్రూట్స్ ధరలు కూడా ఈ పండుగ సీజన్‌లో రికార్డు స్థాయికి చేరాయి. గత దీపావళితో పోలిస్తే పిస్తా ధరలు 60 నుంచి 70 శాతం పెరగ్గా, బాదం ధరలు రకాన్ని బట్టి 20 నుంచి 40 శాతం ఎగబాకాయి. మిఠాయిల తయారీలో వినియోగించే పెషావరి పిస్తా కిలో ధర రూ.4,000కు చేరింది. గత ఆరు నెలల్లోనే ఇది సుమారు 40 శాతం పెరిగింది. పొట్టు తీయని పిస్తా హోల్‌సేల్ ధర ఏడాదిలో దాదాపు 74 శాతం పెరిగి కిలో రూ.1,650కు చేరింది. జీడిపప్పు ధరలు 5–8 శాతం, కిస్‌మిస్ 2–5 శాతం, ఖర్జూరం 5–10 శాతం, అంజీర్ 5–15 శాతం మేర పెరిగాయి. అమెరికా–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి డ్రైఫ్రూట్స్ దిగుమతులకు ఎదురవుతున్న సరఫరా సమస్యలు ధరల పెరుగుదలకు కారణమని దిగుమతిదారులు చెబుతున్నారు.







కామెంట్‌లు (0)