సకల అధికారాలు ఉండవు
కర్నా టక హైకోర్టు వ్యాఖ్యలు
బెంగళూరు : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కర్నాటక హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ సూపర్ కాప్ కాదని, సకల అధికారాలు వుండవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన సమాచారం ప్రాతిపదికగా నిర్దేశిత నేరాన్ని ప్రాసిక్యూట్ చేయడానికి సమర్ధవంతమైన దర్యాప్తు సంస్థలు నిరాకరించినపుడు మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టడానికి ప్రయివేటు ఫిర్యాదును ఈడీ దాఖలు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీకి గల అధికారాలు ఉత్పన్నమైనవి తప్ప ఒరిజినల్‌వి కావని కోర్టు రూలింగ్ ఇచ్చింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద సిఆర్‌పిసి సెక్షన్ 200 లేదా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 223 ప్రకారం ప్రయివేటు ఫిర్యాదు దాఖలు చేయలేరని పేర్కొంది. ‘‘దేశంలో ఏ సంస్థ కూడా అత్యున్నత స్థాయికి ఎదిగి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేయరాదు. నియంత్రణలు, సమతుల్యతల అవసరాలను చట్టం గుర్తిస్తుంది. తన దృష్టికి వచ్చిన ప్రతీదాన్ని, ప్రతీసారీ దర్యాప్తు చేయడానికి ఈడీ సూపర్ పోలీసేమీ కాదు.’’
అని కోర్టు వ్యాఖ్యలు చేసింది. పిఎంఎల్‌ఎ కింద తనకు ఎవైతే సంక్రమించాయో ఆ అధికారాలను మాత్రమే ఇడి ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. చట్టంలో ఒక పనిని ఒక ప్రత్యేక తరహాలో చేయాలంటే ఆ పద్ధతిలోనే చేయాలి, అంతేకానీ మరో పద్ధతిలో కుదరదు. అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధమైన అధికారాల విభజన, నియంత్రణలు, సమతుల్యతల అవసరాన్ని నొక్కిచెప్పింది. మలూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.వై.నంజెగౌడ, కోలార్, చిక్‌బలాపూర్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (కోముల్) అప్పటి డైరెక్టర్ కె.ఎన్.గోపాల మూర్తి, నగేష్, రాజు కృష్ణలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ ఎం.ఐ.అరుణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 నవంబరులో ఇడి దాఖలు చేసిన ఈసీఐర్‌ను, వస్తువుల స్వాధీనాన్ని ధ్రువీకరిస్తూ న్యాయాధికారి ఇచ్చిన ఆదేశాలను, తమకు జారీ చేసిన సమన్లను, ప్రత్యేక కోర్టులో ఈడీ ప్రయివేటు ఫిర్యాదు దాఖలు చేయడాన్ని పిటిషనర్లు సవాలు చేశారు.







కామెంట్‌లు (0)