ఆధార్, డీబీటీతో భారీగా నిధులు మిగిలాయన్న వాదన ఉత్తిదే
యూపీఏ హయాంలో ప్రారంభమైన పథకానికి
బీజేపీ సర్కారు క్రెడిట్ చోరీ
అర్హులైన పేదలకు కోత పెట్టి..
దాన్నే ఆదాగా చూపుతున్న వైనం
కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లు ఆదా చేసిందన్న ప్రధాని మోడీ ప్రకటన వెనుక వాస్తవాలకంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తోంది. లెక్కలకు సరైన ఆధారాలు లేకపోవడం, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పథకానికి బీజేపీ సర్కారు తన ఘనతగా ప్రచారం చేసుకోవడం, నిజమైన లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్న అంశాలు ఈ వాదనపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాలతో ప్రజాధనాన్ని భారీగా ఆదా చేశామని చెప్పుకుంటున్న మోడీ సర్కారు ప్రకటనలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మధ్యవర్తులు ప్రజాధనాన్ని దోచుకున్నారని, తమ ప్రభుత్వం ఆ అక్రమాలకు అడ్డుకట్ట వేసిందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆరు కోట్లకు పైగా నకిలీ రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, బోగస్ పింఛన్లను తొలగించడం ద్వారా రూ.90 వేల కోట్లకు పైగా ఆదా చేసినట్టు గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఈ మొత్తానికి సంబంధించి ప్రభుత్వం చూపుతున్న లెక్కల్లో పారదర్శకత లేదనీ, వాస్తవ ఆదా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని పలు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
రూ.90 వేల కోట్ల లెక్కకు ఆధారాలేవీ?
కేంద్రం ప్రకటించిన ఆదాలో పహల్ (ఎల్‌పీజీ సబ్సిడీ), ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్), ఉపాధి హామీ పథకం ప్రధానమైనవి. 2018 మార్చి నాటికి వీటి ద్వారా వరుసగా రూ.42,275 కోట్లు, రూ.29,708 కోట్లు, రూ.16,073 కోట్లు ఆదా చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ మొత్తాలను ఏ ప్రాతిపదికన లెక్కించారో స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. ప్రజాధనం ఆదా చేశామని ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ లెక్కలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం ప్రజల ముందుంచడం లేదు.
గ్యాస్ ధరల తగ్గుదలకూ ఆధార్ ఖాతాలోనా?
పహల్ పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీనివల్ల వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని కేంద్రం చెప్తోంది. అయితే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. సబ్సిడీ వ్యయం తగ్గడంలో ఆధార్ కంటే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడమే ప్రధాన కారణమని పేర్కొంది. రూ.23,316 కోట్ల సబ్సిడీ తగ్గుదలలో రూ.1,763 కోట్లు మాత్రమే వినియోగదారులు సిలిండర్ల కొనుగోళ్లు తగ్గించడం వల్ల వచ్చాయని వెల్లడించింది. అయినా మొత్తం ప్రయోజనాన్ని ఆధార్ ఖాతాలో వేసుకోవడం ప్రభుత్వ ప్రచార ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఉపాధి హామీ ఆదాపైనా అనుమానాలు
ఉపాధి హామీ పథకంలో ఆధార్ అనుసంధానం ద్వారా రూ.16,073 కోట్లు ఆదా చేసినట్టు కేంద్రం చెప్తున్నా... ఆ లెక్కకు సరైన వివరణ ఇవ్వలేదు. 2016-17లో తొలగించిన 94 లక్షల జాబ్ కార్డుల్లో నకిలీ, డూప్లికేట్ కార్డులు 13 శాతం లోపేనని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. మరో స్వతంత్ర అధ్యయనం ప్రకారం.. 2014 ఏప్రిల్ నుంచి 2016 మార్చి వరకు ఆధార్ వల్ల ఉపాధి హామీ పథకంలో వచ్చిన వాస్తవ ఆదా రూ.30 కోట్లు మాత్రమే.
ప్రచారం కాదు.. పారదర్శకత కావాలి
ఆధార్, డీబీటీ విధానాల వల్ల కొంతమేర అక్రమాలను అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ, వాటి ద్వారా వచ్చిన వాస్తవ ప్రయోజనాలను నిర్ధారించేందుకు పారదర్శకమైన లెక్కలు అవసరం. ఆధార్ ద్వారా ఏటా 11 బిలియన్ డాలర్ల వరకు ఆదా సాధ్యమన్న ప్రపంచ బ్యాంకు అంచనాలపైనా పరిశోధకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రూ.90 వేల కోట్ల ఆదా అంటూ మోడీ సర్కారు చేస్తున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో కోతలను విజయాలుగా చిత్రీకరించడం మానుకునీ, అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం, ఆదా లెక్కలను బహిరంగంగా వెల్లడించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని సామాజిక, హక్కుల కార్యకర్తలు, మేధావులు సూచిస్తున్నారు.
పేదలకు రేషన్ కోత.. అదే ప్రభుత్వానికి ఆదా
ఆధార్ అనుసంధానం ద్వారా 2.75 కోట్ల నకిలీ, నకిలీగా గుర్తించిన రేషన్ కార్డులను తొలగించి దాదాపు రూ.30 వేల కోట్లు ఆదా చేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ లెక్కలకు మద్దతుగా బహిరంగ ఆధారాలు లేవని పలు సామాజిక సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఆధార్ లేకపోవడం, బయోమెట్రిక్ గుర్తింపు విఫలం కావడం వంటి కారణాలతో అర్హులైన పేదలకు కూడా రేషన్ అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజమైన లబ్ధిదారుల పేర్లను తొలగించడం వల్ల ప్రభుత్వ ఖర్చు తగ్గితే, దానిని కూడా ఆదాగా చూపించే ప్రమాదం ఉందని సామాజిక, హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అంటే పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని కుదించి, దాన్నే ప్రభుత్వ విజయంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూపీఏ పథకానికి బీజేపీ ఘనత
డీబీటీ పథకాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరించినప్పటికీ, దాని ప్రారంభం మాత్రం 2013 జనవరిలోనే జరిగింది. అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ-2 ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధార్ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. జనధన్-ఆధార్-మొబైల్ (జామ్) విధానానికి కూడా అప్పుడే పునాది పడింది. గత ప్రభుత్వాలు ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ, వాటి ఫలితాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా మోడీ సర్కారు రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యమిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






కామెంట్‌లు (0)