కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: అగ్నివీర్ కింద దేశ సేవలో నిమగ్నమయ్యే వారికి ఎన్నో ఆంక్షలు పెడుతూ ప్రవేశపెట్టిన కేంద్రం ఇపుడు వెనకడుగువేస్తోంది. రెండేండ్ల సర్వీసు పొడిగింపును ఎంచుకునే అగ్నివీరులు వివాహం చేసుకోవటానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానికి ఓ షరతు విధించింది. 2022లో ప్రారంభమైన అగ్నిపథ్ పథకం నిబంధనల ప్రకారం మొదటి నాలుగేండ్ల సర్వీసుకాలంలో అగ్నివీరులు వివాహం చేసుకోవటానికి వీల్లేదు. రెండోదశ సర్వీసులో చేరి సుమారు 4 వారాలపాటు సాగే ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికే వివాహం చేసుకోవటానికి అనుమతి లభిస్తుందని మెలిక పెట్టింది. అగ్నిపథ్ పథకం ఎప్పటికప్పుడు మార్పులు చెందుతుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి ఇటీవల పేర్కొన్నారు.అగ్నివీర్ల సేవా కాలాన్ని మరో రెండేండ్ల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రివర్గం ఇటీవల పేర్కొంది.
అగ్నివీర్ రిక్రూట్మెంట్ కింద నాలుగేండ్ల ప్రాథమిక పదవీ కాలం ముగిసిన తర్వాత బయటకు వెళ్లాల్సిన 75 శాతం మంది అగ్నివీర్లకు అదనంగా మరో రెండేండ్ల పాటు సేవలు అందించే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఈ అదనపు రెండేండ్ల పొడిగింపు గడువు పూర్తైన తర్వాత ఆసక్తి గల ఆగ్నివీర్లు సాయుధ దళాల్లో చేరవచ్చని తెలిపింది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్. ఎస్. రాజా సుబ్రమణి వివరాలు వెల్లడించారు. వాస్తవానికి, ప్రతిభ ఆధారంగా 25శాతం మంది అగ్నివీర్లను రక్షణ దళాల్లో (రెగ్యులర్ ఫోర్సెస్) చేర్చుకొని, మిగిలిన 75శాతం మంది అగ్నివీర్లను క్రమశిక్షణ కలిగిన, ఉత్సాహవంతులైన యువకులుగా తిరిగి సమాజంలోకి పంపేది. కానీ, అగ్నిపథ్‌ను సవరించన కేంద్రం, ఆ 75 శాతం అగ్నివీర్లకు అదనంగా మరో రెండేళ్ల పాటు సైన్యంలో పనిచేసే చేసే అవకాశం కల్పించింది. రెండేండ్ల కాలం పూర్తైన తర్వాత ఆసక్తి ఉన్న వారందరినీ నిర్దిష్ట ఎంపిక ప్రమాణాలకు లోబడి సాయుధ దళాల్లో చేర్చుకోనుంది.






కామెంట్లు (0)