కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన
26న ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోఖోలు..ఎస్‌కేఎం కన్వీనర్లు టి సాగర్, పశ్య పద్మ తదితరులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నాలుగేండ్లు గడుస్తున్నా అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) రాష్ట్ర కన్వీనర్లు విమర్శించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం వ్యవసాయ రంగాన్ని బలిచేస్తూ, రైతుల ఆదాయానికి భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్‌కెఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, చేతివృత్తిదారులు, విద్యార్థులు, యువజన, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సోమవారం హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ,బి.రాము, మామిడాల భిక్షపతి, పెద్దారపు రమేష్, , జక్కుల వెంకటయ్య, నాగిరెడ్డి, , భాస్కర్ మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీల మేరకు కనీస మద్దతు ధరల చట్టం, రుణమాఫీ/రుణ విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉపయోగపడేలా పంటల బీమా విధానంలో మార్పులు చేయాలన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాలతో చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నందున, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మంది పౌరుల ఓటు హక్కును తొలగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనీ, తెలంగాణలోనూ దాదాపు 93 లక్షల మందికి ఇదే పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎలినినో ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, తెలంగాణకు కేంద్రం నుంచి కనీసం రూ. 50 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ఆహార పంటలకు ఎకరానికి రూ. 30వేలు, వాణిజ్య పంటలకు ఎకరానికి రూ. 50వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
యాసంగిలో పంటలు వేసుకోవద్దని చెప్పే ముందు రైతులకు తగిన భరోసా ఇవ్వాలని సూచించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం ద్వారా కేంద్ర వాటా తగ్గి, నిధుల్లో కోత పడిందని గుర్తు చేశారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరిగినందున, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు పెంచి, రాష్ట్ర వాటాతో సంబంధం లేకుండా నేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు తమ బాధ్యతగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జరిగే ఆందోళనల్లో వ్యవసాయ కూలీలు, కార్మికులు, చేతివృత్తుల వారు, విద్యార్థులు, యువజన, మహిళా, సామాజిక వర్గాలతో పాటు విద్యావంతులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేచేశారు.






కామెంట్‌లు (0)