60 శాతం పెరిగి 16 బిలియన్ డాలర్లకు చేరిక
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశన్నంటడంతో భారత్ చమురు, గ్యాస్ దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. అక్టోబర్ నెలలో దేశ నికర చమురు, గ్యాస్ దిగుమతి బిల్లు గతేడాదితో పోలిస్తే 60శాతం పెరిగి 16 బిలియన్ డాలర్లకు చేరింది. 2025 అక్టోబర్ నాటికి నికర బిల్లు 10.0 బిలియన్ డాలర్లుగా ఉండేదని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్-(పీపీఏసీ) తెలిపింది. అక్టోబర్‌లో బ్రెంట్ ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 124.77 డాలర్లుగా నమోదైంది. 2025 అక్టోబర్‌లో ఇది 64.75 డాలర్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 116.77 డాలర్లుగా ఉంది.
అలాగే దేశంలో ఎల్ పీజీ వినియోగం అక్టోబర్‌లో 12.3 శాతం, ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 15.1 శాతం తగ్గింది. ఏప్రిల్ 1 నాటికి 33.4 కోట్లుగా ఉన్న క్రియాశీల గృహ ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య నవంబర్ 1 నాటికి 32.6 కోట్లకు తగ్గిందని పీపీఏసీ తెలిపింది. ఎల్ పీజీ వినియోగం తగ్గినప్పటికీ అక్టోబర్‌లో డీజిల్ వినియోగం 12 శాతం పెరిగి 8.5 మిలియన్ టన్నులకు చేరింది. పెట్రోల్ వినియోగం 3.5 శాతం, బిటుమెన్ వినియోగం 16.5 శాతం వృద్ధి చెందాయి. మొత్తంగా అక్టోబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 2.7 శాతం పెరిగి 20.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఏప్రిల్-అక్టోబర్ త్రైమాసికంలో ఇది 3.2 శాతం తగ్గి 134.2 మిలియన్ టన్నులుగా ఉంది.
ముడి చమురు వినియోగంలో
88.7 శాతం దిగుమతుల ద్వారానే
అక్టోబర్‌లో నాచురల్ గ్యాస్ వినియోగం 7.27 శాతం తగ్గి 5,707 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. అలాగే, ఎల్ఎన్జీ దిగుమతులు 6.94 శాతం తగ్గి 3,014 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు చేరాయి. అక్టోబర్‌లో భారత్ 24.1 మిలియన్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది, ఇది 7.1 శాతం లేదా రోజుకు సుమారు 5.70 మిలియన్ బ్యారెళ్ల పెరుగుదల. అందులో, 22.0 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడి చమురు కాగా, దేశీయ ఉత్పత్తి 2.1 మిలియన్ టన్నులుగా ఉంది. అక్టోబర్‌లో ముడి చమురు వినియోగంలో 88.7 శాతం దిగుమతుల ద్వారానే జరిగింది. దేశీయ ముడి, కండెన్సేట్ ఉత్పత్తి 2.3 మిలియన్ టన్నులుగా ఉంది. అక్టోబర్‌లో సహజ వాయువు కోసం దిగుమతులపై ఆధారపడటం 52.8 శాతంగా ఉంది.
పీపీఏసీ డేటా ప్రకారం,సెప్టెంబర్‌లో బ్రెంట్ సగటున 116.77 డాలర్లు ఉండగా, సరిగ్గా గతేడాది అక్టోబర్‌లో 64.75 డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 65.08 డాలర్లుగా ఉన్న ఇండియన్ బాస్కెట్, అక్టోబర్‌లో సగటున 119.91 డాలర్లుగా ఉంది. ఏప్రిల్- అక్టోబర్ మధ్య, నికర దిగుమతుల బిల్లు గత ఏడాది ఇదే కాలంలోని 70.3 బిలియన్ డాలర్ల నుంచి 97.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముడి చమురు దిగుమతులు పరిమాణంలో 2.7 శాతం పెరిగినప్పటికీ, వాటి వ్యయం 72.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 111.0 బిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్ పీజీ) వినియోగం అక్టోబర్‌లో 12.3 శాతం, ఏప్రిల్-అక్టోబర్ మధ్య 15.1 శాతం తగ్గింది. క్రియాశీల దేశీయ ఎల్ పీజీ వినియోగదారుల సంఖ్య ఏప్రిల్ 1 నాటి 33.4 కోట్ల నుంచి నవంబర్ 1 నాటికి 32.6 కోట్లకు తగ్గింది.
హార్ముజ్‌ను మూసివేయడంతో ధరలకు రెక్కలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత చమురు రవాణాకు కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఆ నేపథ్యంలో ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. అంతేకాదు, మొదటి రెండు నెలల్లో ఎల్పీజీ దిగుమతులు 50 శాతానికి పైగా తగ్గాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ తన 'వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2026'లో తెలిపింది.






కామెంట్లు (0)