నవతెలంగాణ-హైదరాబాద్ : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మెరుపు దాడుల తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గురువారం కూడా దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది.
నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. పాక్ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది.
మంగళవారం అర్ధరాత్రి నుంచి పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో 13 మంది భారత పౌరులు మృతిచెందగా.. 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు చిన్నారులున్నారు. పహల్గాం దాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
పాక్ ఆర్మీ కాల్పులు.. భారత జవాను మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES