Monday, January 26, 2026
E-PAPER
Homeదర్వాజజాజ్‌ కవిత్వం

జాజ్‌ కవిత్వం

- Advertisement -

పాశ్చాత్య సంగీతంలోని రకాలలో జాజ్‌ ఒకటి అని మనకు తెలుసు కానీ, జాజ్‌ సంగీతం లాగా జాజ్‌ కవిత్వం అనేది ఒకటి ఉన్నదని చాలా మందికి తెలియకపోవచ్చు. జాజ్‌ కవిత్వం అంటే జాజ్‌ సంగీతాన్ని వర్ణించే కవిత్వం కాదు, జాజ్‌ సంగీతంలా ప్రవర్తించే కవిత్వం. అది చెవులకు వినిపించేది కాకుండా కాయితం మీద కనులకు కనిపించే సంగీతం అన్నమాట. మరో విధంగా చెప్పాలంటే, అది సంగీత లక్షణాలను పొదవుకొని ఉంటుంది. కాబట్టి, ఈ కవులను వాగ్గేయకారులు అనాలి. జాజ్‌ కవిత్వంలోని లక్షణాలేమిటో చూద్దాం. అప్పటికప్పుడు స్ఫురించే పదాలను చేర్చడం లేదా మార్పుల సహాయంతో మెరుగుదలను సాధించటం (improvisation) మొదటగా చెప్పుకోతగింది. కర్ణాటక సంగీతంలో ‘మనోధర్మ’ రకం లాగా. బలమైన బీట్స్‌ను బలహీనంగా, బలహీనమైన బీట్స్‌ను బలమైనవిగా మార్చివేస్తూ అనూహ్యమైన లయ నెలకొనేలా చేయడం మరొక లక్షణం. దీన్ని సంగీత పరిభాషలో syncopation అంటారు. ఊగిసలాడే లయ (swing), వేదన నిండిన స్వరం (blue note), సామూహికతనూ సమావేశాన్నీ తలపించడం (Jam session) మొదలైనవి ఇతర ఆనవాళ్లు.

జాజ్‌ కవిత్వంలో రూపం (form) చాలా వరకు వచన కవిత్వంలో ఉన్నట్టే ఉంటుంది. అరుదుగా దీనికి మినహాయింపులు ఉండవచ్చు. గ్వెండోలిన్‌ బ్రూక్స్‌ను దీనికి ఉదాహరణగా చూపవచ్చు. మౌఖికత, కొంత మార్పుతో పునరావతి, మాండలిక భాష, భావోద్వేగంలో ఎకాయెకిన సంభవించే మలుపులు, సంగీతపరమైన విరామాలు, సామూహిక స్వరం… ఇవన్నీ కూడా జాజ్‌ కవిత్వంలో ఇమిడి ఉంటాయి. కొంతవరకు మన జానపద గీతాలను, వీధినాటకాలను పోలివుంటుంది కాబట్టి, దీన్ని ప్రజల కవిత్వంగా ఎంచవచ్చు. జాజ్‌ కవిత్వం 20వ శతాబ్దపు ప్రారంభంలో, అమెరికాలోని ఆఫ్రికన్‌-అమెరికన్‌ సంస్కృతిలో పుట్టింది. వేదన నిండిన గీతాలు, ఆధ్యాత్మిక సంగీతం, శ్రామిక జనుల పాటలు దీనికి ఆధారాలు. వీటిలో మధ్య మధ్య తెగిపోయే వాక్యరచనా విన్యాసం (broken syntax), శ్వేత జాతీయుల సంప్రదాయ రచనా శైలి పట్ల వ్యతిరేకత కనిపిస్తాయి. లాంగ్టన్‌ హ్యూస్‌ను జాజ్‌ కవిత్వానికి ఆద్యుడుగా చెప్పుకోవాలి. ఈయన ఈ కొత్తరకం పోయెట్రీని వరుసగా, నిలకడగా సృష్టించాడు. ఇతని The Weary Blues అనే ‘కృతి’లోని లక్షణాలు గమనించతగినవి.

He did a lazy sway…
He did a lazy sway…. (పునరావృతి)
Ain’t got nobody in all this world,
Ain’t got nobody but ma self (కొంత మార్పుతో పునరావృతి)

ఈ రకపు కవిత్వాన్ని రాసిన మరొక వ్యక్తి బాబ్‌ కాఫ్‌ మన్‌. ఇతని కతులలో సద్యఃస్ఫూర్తి (spontaneity) కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అకస్మాత్తుగా విజృంభించడం, పిచ్చి ఆవేశం, అధివాస్తవిక పదచిత్రాలు ఇతని రచనలను పాడదగినవిగా, అభినయింప తగినవిగా మారుస్తాయి. తన కవితలను కాయితం మీద రాయడం కాఫ్‌ మన్‌కు ఎంతమాత్రం నచ్చేది కాదట! అంటే ఆశువుగా సజించి పాడేవాడన్నమాట. O-Jazz-O War Memoir అనే గీతంలో ”ఈ అమ్మానాన్నల ప్రపంచంలో నవ్వుకు తావు లేదు/ అందుకే మేం ఏడ్వటం నేర్చుకున్నాం” అంటాడు. ఇంకో చోట, వాళ్లు నిర్జన వీధుల్లోని చీకటి మూలల్లో పిల్లలను చంపి వాళ్ల తల్లులను చెరిచి పతకాలు సంపాదించుకున్నారు అని వస్తుంది. Singing the Blues అనే గీతంలో… ”చంద్రుడూ తారలూ ఆకాశంలో వెలగడం లేదు/ నాది అనుకున్న స్వప్నం నన్ను వీడింది/ ఇక నీమీద పడి రోదించటం తప్ప/ చేసేందుకు వేరే ఏదీ లేదు నాకు” అంటాడు.

జాజ్‌ కవిత్వానికి సంబంధించి హ్యూస్‌, కాఫ్‌ మన్‌లను భిన్న ధ్రువాలుగా సూచించవచ్చు. కానీ వారు చైతన్యం పరంగా భిన్నమైనవారు కారు. రచనా విధానం పరంగా మాత్రమే వేరైనవారు. హ్యూస్‌ ది సామూహిక స్వరం. అది అందరికీ అర్థమవుతుంది. వాక్య నిర్మాణం సరళమైనది, ప్రవాహగుణం కలది. కాఫ్‌ మన్‌ ది దార్శనిక ఏకాంత స్వరం, అందరికీ సులభంగా అర్థం కానిది. వాక్యనిర్మాణం మధ్యమధ్య తెగిపోయేది. హ్యూస్‌లో ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. కాఫ్‌ మన్‌లో అరాచకత్వం ఉంటుంది. హ్యూస్‌ కవిత్వం హాయిగా పాడుకునేందుకు అనువైనది. కాఫ్‌ మన్‌ కవిత్వం షాక్‌కు గురి చేస్తుంది. గ్వెండోలిన్‌ బ్రూక్స్‌ అనే మరో జాజ్‌ కవయిత్రి తన We Real Cool కవితను అద్భుతమైన కుదింపుతో (పదాల పొదుపుతో), సామాజిక స్పృహతో రాయడం గమనించతగింది. ఇది ఛందోబద్ధమైన కవిత (metrical poem) లాగా ఉండి, సైనికుల కవాతును తలపిస్తుంది. చాలా చిన్న, చాలా తీక్షణమైన జాజ్‌ కవిత. ‘ఆవగింజలో అనంత విశ్వం’ అనే శీర్షికతో రాసిన మరో వ్యాసంలో ఈ గీతం గురించిన విపులమైన వివరణ ఇచ్చాను.

ఇప్పటిదాకా చెప్పిన వారంతా ఆఫ్రికా మూలాలు కలిగిన అమెరికన్‌ కవులు. కానీ ఈ రకం కవిత్వం రాసిన జాన్‌ గరీగ్‌ (Jean Garrigue), జాక్‌ కెరువాక్‌ (Jack Kerouac) మొదలైనవాళ్లు పుట్టుకతో అమెరికన్లు. Jazz Bit అనే కవితలో గరీగ్‌ శ్రవణ, దశ్య, ఘ్రాణేంద్రియ అనుభవాలతో చక్కని synaesthesia ను వెలయిస్తూ రాత్రికి సంబంధించిన పదచిత్రాలను అద్భుతంగా పొందుపరచారు. కెరువాక్‌ October in the Railroad Earth అన్న పారాగ్రాఫ్‌ కవితలో చైతన్య స్రవంతి శిల్పాన్ని జోడించడం ఆసక్తిని కలిగించే విషయం. జాజ్‌ పొయెట్రీని పోలిన కవిత్వాన్ని తెలుగులో విరివిగా రాయవచ్చా అని ప్రశ్నిస్తే, దానిలోని చాలా లక్షణాలను కలిగిన తెలుగు కవిత్వం ఒక ప్రత్యేక కవిత్వ ఉద్యమంగా కాకపోయినా అక్కడ కొంతా ఇక్కడ కొంతా విడివిడిగా ఇప్పటికే ఉన్నదనీ, దళిత, మైనారిటీ, బహుజన కవిత్వాలు దానికి ఉదాహరణలుగా పనికి వస్తాయనీ చెప్పవచ్చు. కానీ పాక్షికంగా మాత్రమే. ఎందుకంటే వాటిలో సంగీత ప్రవర్తన లేదు. అయితే, ప్రజా వాగ్గేయకారులైన గద్దర్‌, గోరటి వెంకన్న, వంగపండు మొదలైనవారి కవిత్వం దానికి దగ్గరగా వస్తుందని చెప్పవచ్చు.

ఎలనాగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -