57 స్థానాలు ఖరారు
నితీశ్ సర్కారును వెంటాడుతున్న అసమ్మతి స్వరాలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీ(యూ) తన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి 57 స్థానాలను ప్రకటించింది. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసుకున్న సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీ(యూ) 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించగా.. ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. రాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్‌పుర్ నుంచి క్యాబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్‌బార్సా నుంచి రత్నేష్ సదా, మోకామా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహాలు బరిలోకి దిగుతున్నారు. మరోపక్క బీజేపీ ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్) 29 చోట్ల, హిందుస్థాన్ అవాం మోర్చా (హెచ్‌ఏఎం) ఆరుచోట్ల, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) ఆరుచోట్ల బరిలో దిగేలా సీట్ల సర్దుబాటు కుదిరింది. బీజేపీ కంటే జేడీ(యూ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. కాగా మరోవైపు టికెట్ పంపిణీపై అనేకమంది జేడీ(యూ) నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ టికెట్ కోసం నితీశ్ ఇంటివద్ద నిరనసలు, రెబల్‌గా పోటీ చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీట్లు ఖరారైనా రెబల్స్ ఎక్కడ కొంపముంచుతారోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. దీనికి తోడు అధికారపార్టీ తరఫున బరిలోకి దిగనున్న మంత్రులను.. ఏం చేశారంటూ స్థానిక ఓటర్లు నిలదీస్తున్నారు.