మనిషి వ్యక్తం చేసే భావోద్వేగాలలో ‘అసూయ’ ఒక సంక్లిష్టమైన, సహజమైన మానవభావోద్వేగం. ఇది ఆనందం, దుఃఖం కోపం లాంటిదే. కానీ ఇది తరుచుగా అభద్రత, భయం, కోరికల నుండి ఇతరులను పోల్చుకోవడం వల్ల జనిస్తుంది. అసూయ వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అసూయను సరిగ్గా బ్యాలన్స్ చేసుకోగల్గితే జీవితాలను అద్భుతంగా మలుచుకోవచ్చు. కానీ అది అందరికి సాధ్యం కాదు కదా!
ఒకరికి వున్నది మరొకరు కోరుకున్నప్పుడు లేదా తమకు దక్కలేదని బాధపడినప్పుడు సహజంగా అసూయ కల్గుతుంది. ఇది ఎక్కువగా స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య భాగస్వామ్యుల మధ్య, సహోద్యోగుల మధ్య తరగతి గదిలో తోటి పిల్లల మధ్య, అసూయ భావన కల్గుతుంది. దీనికి కారణాలు పరిశీలిస్తే… అభద్రత వల్ల, తమకు ఏదో లోటు ఉందనే భావనతో అసూయ కలుగుతుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవడం వల్ల కూడా అసూయ తలెత్తే అవకాశం వుంది. మొదటి దానికి ఉదాహరణగా పురాణాలలో దుర్యోధనుడు పాండవులను మొదటి నుండి అభద్రతా భావంతోనే చూశాడు. అది పెరిగి పెద్దౌతున్న కొద్దీ దానికి శకుని లాంటి వారు ఆజ్యంపోసి పెంచారు.
రెండవ దానికి కర్ణుడిని ఉదాహరణగా చెప్పొచ్చు. కర్ణుడు ప్రతీసారి అర్జునుడిని పోల్చుకొని అసూయ చెందేవాడు. దానికి తోడు దుర్యోధనుడు ప్రోత్సహించి అంగ రాజ్యమిచ్చి తన స్నేహితుడిగా దగ్గరకు తీసుకోవడం మూలంగా ఎప్పుడు కౌరవుల పాండవుల మధ్య జరిగే సంఘర్షణలో కర్ణుడు అర్జునుడు తనకు పోటీగా భావించేవాడు. ఇంకోటి భయంతో కలిగే అసూయ. తమకు సంబంధించిన ఆస్తులను కోల్పోతామేమో అనే భయంతో అసూయ జనిస్తుంది. మరోటి వారిపై వారికే నమ్మకం లేకపోవడం వల్ల కలిగే (తక్కువ స్థాయి ఆత్మ గౌరవం) అసూయ. మీరు ఏదైనా పని మొదలుపెట్టినట్లైతే మీతో పోటీగా భావించేవారు సహజంగానే మీ చుట్టూ వుంటారు. అది వ్యాపారమైనా, తరగతి గది, కుటుంబం, పరిసరాలు ఏవైనా కావచ్చు… మీరు ఒక్క అడుగేస్తే పది అడుగులు వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ మీరు విజయం సాధిస్తారోనని మీకు లభించే కీర్తి ప్రతిష్ట దక్కకుండా చేయాలని రకరకాల సూటిపోటి మాటలతో అసూయను వెళ్ళగక్కుతూ వుంటారు. ఈ సందర్భంగా మనస్తత్వ శాస్త్రవేత్తలు చింపాంజీల ప్రవర్తనపై జరిపిన ప్రయోగాన్ని చదవండి.
ఒక పెద్ద పంజరంలో కొన్ని చింపాంజీలను వుంచారు. వాటికి కొంచెం దగ్గరలో ఎత్తైన బల్లపై అరటిపండ్ల గెలను ఉంచి, ఆ దగ్గరగా నిచ్చెన, దానిపై చల్లని నీటి జల్లు పడేలా ఏర్పాటు చేశారు. ఆ సమూహంలో నుండి చింపాంజీలు ఎన్నిసార్లు ఆ నిచ్చెనపైకి ఎక్కే సమయంలో వాటిపై ప్రతిసారీ చల్లని నీరు వాటిపైపడేది. ఇలా కొన్నిసార్లు ప్రయత్నించిన చింపాంజీలు ఆ నిచ్చెనను ఎక్కటం మానుకున్నాయి. తరువాత ఆ శాస్త్రవేత్తలు పంజరంలోని ఒక చింపాంజీని బయటకు తీసి కొత్త చింపాంజీని అందులోకి పంపించారు. అది పంజరంలోకి వెళ్ళినకొద్దిసేపటికి అందులోని పరిసరాలను గమనించి ఎత్తైన బల్లపై వున్న అరటిపళ్ళ గెలను చూసి నిచ్చెన సహాయంతో తీసుకోవాలని నిచ్చెన ఎక్కుతుంది. ఎప్పుడైతే కొత్తగా వచ్చిన చింపాంజీ అరటిపళ్ళను అందుకోవడానికి నిచ్చెన ఎక్కుతుందో వెంటనే అందులో వున్న పాత చింపాంజీలు దానిపై దాడిచేసి చితకబాదుతాయి. దానికి ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కాదు. కానీ నిచ్చెన ఎక్కడం మూలంగా తన తోటి సహచరులు తనపై దాడి చేశాయని భావిస్తుంది. ఈ సమయంలో శాస్త్రవేత్తలు క్రమక్రమంగా అన్ని పాత చింపాంజీలను ఆ పంజరంలో నుండి బయటకు తీసి కొత్త వాటిని పంజరంలోకి పంపించి బయట నుండి తాళం వేస్తారు యధావిధిగా.
ఇప్పుడు పంజరంలో వున్న ఏ చింపాంజీపై కూడా చల్లని నీళ్ళ ప్రయోగం జరుగలేదు. కానీ అందులో వున్నవి అన్నీ కొత్తవి కావటం వల్ల ఏ చింపాంజీ నిచ్చెన ఎక్కి అరటిపళ్ళను అందుకునే ప్రయత్నం చేస్తుందో మిగిలిన అన్ని చింపాంజీలు దానిపై దాడిచేసి గాయపర్చేవి. గాయపడిన దానికి మాత్రం మిగితావి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలియకపోయేది. మనం కూడా జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు తెలియని చాలా విషయాలలో చుట్టుపక్కలవారిని గుడ్డిగా అనుసరిస్తుంటాం. ఏది సరైనదో, ఏది కాదో (శాస్త్రీయమైనది కాదో) నిర్ధారించుకోకుండా గుడ్డిగా అనుసరిస్తుంటాం. ఫలితంగానే మనుషుల మధ్య చాలా అంశాల్లో ఘర్షణలు తలెత్తి ప్రపంచ శాంతికి విఘాతం కల్గుతోంది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలలోని మానవ సమూహాలకు వర్తించే అంశం కావటం బాధ కల్గించే అంశం.
ఇక్కడ ఒక విషయం ప్రస్తావించి ముగిస్తాను 1999 లో రతన్ టాటా ఇండికా కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టి నష్టాలను చవి చూశారు. బ్రిటన్‌లో ప్రసిద్ధమైన ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫోర్డ్ అధికారులు రతన్ టాటాను వారు తయారు చేసిన టాటా ఇండికా కారును తక్కువ చేసి మాట్లాడారు. టాటా మోటార్స్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఫోర్డ్ ఆసక్తి చూపినా, అది ఒక చిన్న డీల్‌గా భావించి అవమానించారు. ఈ సంఘటనతో రతన్ టాటా అక్కడి నుండి వెనుదిరిగారు. ఆ తరువాత పది సంవత్సరాలకు 2008 లో ఆర్ధిక సంక్షభ సమయంలో ఫోర్డ్ కంపెనీ తీవ్ర ఇబ్బందులో పడింది. అప్పుడు టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి బ్రిటీష్ లగ్జరీ కార్ల బ్రాండ్ లను ఫోర్డ్ కంపెనీ నుండి 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి పడిన చోట లేచి నిలబడే విజయం దక్కించుకుంది.
ఈ ఒప్పంద సమయంలో దేశీయంగా/ అంతర్జాతీయంగా రతన్ టాటాపై ఎక్కువగా అసూయతో అవమానంతో కూడిన విమర్శలు చేశారు. అయినా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం రతన్ టాటా ప్రతిష్టకు మరింత శోభను చేకూర్చింది. ఈ ఒప్పందం సమయంలో బిల్ ఫోర్డ్ టాటాకు కతజ్ఞతలు చెబుతూ మీరు జీూ= ను కొనుగోలు చేయడం ద్వారా మాకు గొప్ప సహాయం చేస్తున్నారు అని అన్నారు. ఈ సంఘటన టాటా మోటార్స్‌ను ప్రపంచ స్థాయి ఆటో మేకర్ సంస్థగా నిలబెట్టింది. ఈ కథ ద్వారా మనం తెల్సుకునే నీతి ఏమిటంటే అసూయ మనిషి సహజమైన బావోద్వేగం ఐనప్పటికీ అలాంటి వారి పట్ల దూరంగా ఉండి, పట్టుదలతో ముందుకువెళ్తే తను అనుకున్న లక్ష్యన్ని పూర్తి చేయగలడని ఈ సంఘటనను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.
- డా||మహ్మద్ హసన్,
9908059234



