కోశాధికారిగా ఎన్నికైన అనిల్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నూతన కార్యదర్శిగా మన్నె జీవన్ రెడ్డి, కోశాధికారిగా అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఆఫీస్‌బేరర్లలో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ కాగా.. ఈ రెండింటి కోసం ఎన్నికలు నిర్వహించారు. కార్యదర్శిగా మన్నె జీవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కోశాధికారి పదవికి ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు నిర్వహించారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్ 61 ఓట్లు సాధించి కోశాధికారిగా ఎన్నికయ్యారు.
కోశాధికారి ఎన్నికలో మొత్తం 153 ఓట్లు పోలవగా, హరినారాయణ 59, ఆగం రావు 27, సి బాబురావు 6 ఓట్లు దక్కించుకున్నారు. కార్యదర్శిగా ఎన్నికైన జీవన్ రెడ్డి, కోశాధికారిగా ఎన్నికైన అనిల్ కుమార్‌కు ఎన్నికల అధికారి సంపత్ కుమార్ ధ్రువపత్రాలు అందజేశారు. జీవన్ రెడ్డి, అనిల్ కుమార్‌లు ఈ ఏడాది అక్టోబర్ వరకు హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లుగా కొనసాగనున్నారు. ప్రస్తుత కార్యవర్గం మూడేండ్ల పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌లోనే ముగియనుంది.
వివేక్ అనుచరుడికి పట్టం
హెచ్‌సీఏ నిధులు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ కు మళ్లించి.. క్రికెట్ అభివృద్ది నిధులను ఖాళీ చేశారని ఓ వైపు క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతుండగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో వివేక్ అనుచురుడు అనిల్ కుమార్ కోశాధికారిగా ఎన్నికవటం గమనార్హం. 2023లో జరిగిన ఎన్నికల్లో వివేక్ మద్దతుతో అనిల్ కుమార్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయారు. వివేక్ ప్యానల్ నుంచి దల్జీత్ సింగ్ ఉపాధ్యక్షుడిగా, బసవరాజు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. శివలాల్ యాదవ్ మద్దతుతో అమర్‌నాథ్ అధ్యక్షుడిగా పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలయ్యాడు. కానీ ఇటీవల అంబుడ్స్‌మన్ ఎన్నికైన అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు స్థానంలో అమర్‌నాథ్‌ను ప్రెసిడెంట్‌గా నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
వివేక్, శివలాల్ యాదవ్ ఇప్పుడు ఏకతాటిపైకి రాగా.. హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లు అందరూ వివేక్ వర్గమే అని చెప్పవచ్చు. కార్యదర్శిగా ఎన్నికైన మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వివేక్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా..జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో క్రియాశీలంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశీస్సులతోనే కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని హెచ్‌సీఏ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో మూడు ప్యానల్స్ నుంచి ఇద్దరేసి ఆఫీస్ బేరర్లతో అపెక్స్ కౌన్సిల్‌లో ఆధిపత్యం పోరు కనిపించింది. ఇప్పుడు అందరూ వివేక్ వర్గమే కావటంతో హెచ్‌సీఏలో ఆధిపత్య పోరుకు తెరపడిందని భావించవచ్చు!.



