నవతెలంగాణ – హైదరాబాద్; మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మార్చి 25న ఉదయం జగిత్యాలలో ఆయన అనుచరులు, మద్దతుదారుల సమక్షంలో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..40 ఏండ్ల కాంగ్రెస్ తో అనుభందం ఉందన్నారు. అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉన్నా ఫిరాయింపులు ఎందుకని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పారు. దశాబ్దకాలం పాటు కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చామన్నారు. కార్యకర్తలకు ఇష్టం లేకున్నా ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని విమర్శించారు. ఎంతో భాదను దిగమింగుకుని పార్టీలో కొనసాగనని ఆవేదన వ్యక్తం చేశారు.
నా హక్కులకు భంగం వాటిల్లదని మాటిచ్చారని చెప్పారు. ఇద్దరు మంత్రులు తనతో మాట్లాడారని ..కేసీ వేణుగోపాల్ తరపున వచ్చి హామీ ఇచ్చారని తెలిపారు. కార్యకర్తల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని పరిస్థితి కాంగ్రెస్ లో ఉందన్నారు. కాంగ్రెస్ లో నాకు, నా అనుచరులు ఎన్నో అవమానాలు పడ్డామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరిగిందన్నారు. తోడు నిలిచిన వారికి న్యాయం చేయలేకపోయానన్నారు. నాయకుడిని నడిబజారులో కిరాతకంగా చంపారని సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ కార్యకర్తకు దారుణ ఘటన జరిగితే స్పందించకూడదా? నాకు తోడుగా నిలిచిన నాయకుడు చనిపోతే సీఎం నుంచి కనీస పరామర్శ లేదు. కాంగ్రెస్ కార్యకర్త దారుణంగా చనిపోతే కుటుంబానికి కనీస ఓదార్పు లేదు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామనే భరోసా కల్పించలేదు. అప్పుడు నేను శాసనమండలి సభ్యుడిని.. రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది’ అని అన్నారు.



