Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల?

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల?

- Advertisement -

బిల్లుపై ట్రంప్‌ సంతకం
వాషింగ్టన్‌ : అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ను విడుదల చేసే బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా డెమోక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. ‘డెమోక్రాట్ల గురించి.. లైంగిక నిందితుడు జెఫ్రీతో వారికి ఉన్న అనుబంధాల గురించిన నిజాలు బహుశా త్వరలోనే బయటపడవచ్చు. ఎందుకంటే నేను ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ విడుదల చేసే బిల్లుపై సంతకం చేశాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. తమ విజయాల నుంచి ప్రజల దష్టిని మరల్చేందుకు.. ఎప్‌స్టీన్‌ కేసును ఆయుధంగా పదేపదే ఉపయోగిస్తున్నారన్నారు. ఈ బిల్లుకు ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ట్రాన్స్పరెన్సీ యాక్ట్‌’ అని పేరు పెట్టారు. ఈ ఫైల్స్‌ విడుదల చేయడాన్ని తాను వ్యక్తిగతంగా సాధించిన పారదర్శక విజయంగా ట్రంప్‌ అభివర్ణించారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల అంశాన్ని ఇటీవల ప్రతినిధుల సభ ముందుకు తీసుకురాగా.. 427-1 ఓట్లతో ఆమోదం లభించింది.

తర్వాత సెనెట్‌లో దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించాక.. తాజాగా ట్రంప్‌ దానిపై సంతకం చేశారు. ఇక, ఇప్పుడు న్యాయశాఖ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అన్ని ఫైల్స్‌తో పాటు 2019లో జైలులో అతడి మృతిపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, బాధితులకు సంబంధించిన వివరాలు, దర్యాప్తును ప్రభావితం చేసే వివరాలను బయటపెట్టకుండా ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్‌ పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఇండ్లకు రప్పించి అఘాయిత్యాలకు పాల్పడేవారనేది ప్రధాన ఆరోపణ. కొన్నేండ్ల తర్వాత ఈ చీకటి వ్యవహారం బయటపడింది. అరెస్టైన నిందితుడు ఎప్‌స్టీన్‌ 2019లో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎప్‌స్టీన్‌ కేసు ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉన్నప్పటికీ.. ట్రంప్‌ ఎలాంటి తప్పు చేయలేదని వైట్‌హౌస్‌, స్పీకర్‌ జాన్సన్‌ తెలిపారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను బహిర్గతం చేయడాన్ని ఇంతవరకు ట్రంప్‌ వ్యతిరేకిస్తూ వచ్చినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో యూటర్న్‌ తీసుకున్న ఆయన.. ఈ బిల్లుకు మద్దతివ్వాలంటూ రిపబ్లికన్లను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -