– అనారోగ్యంతో పాఠశాల వీడుతున్న విద్యార్థులు
– పాఠశాలను సందర్శించిన డిప్యూటీ తహసిల్దార్ కరుణాకర్ రావు
నవతెలంగాణ – ఝరాసంగం
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వైరల్ జ్వరాలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న సంపు లీకై ఆవరణ అంతా మురుగునీరు నిలిచి కంపు కొడుతోంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తూ అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక డిప్యూటీ తహసిల్దార్ కరుణాకర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు, సాయి కుమార్ పాఠశాలను సందర్శించారు.
అనారోగ్యానికి గురైన విద్యార్థులతో వారు మాట్లాడారు. పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా.. స్పెషల్ ఆఫీసర్ ఎందుకు పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మండల వైద్యాధికారిని పిలిపించి పాఠశాలలో ప్రత్యేక వైద్య క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. పాఠశాలలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని పాఠశాల ప్రత్యేక అధికారికి ఆదేశించారు. వారి వెంట సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కె చంద్రన్న ఉన్నారు.
