Monday, March 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం

రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం

- Advertisement -

– అరణ్య భవన్‌ను సందర్శించిన జపాన్‌ ప్రతినిధులు
– అటవీ అధికారులతో భేటీ..
– ఐదేండ్లకు రూ.1270 కోట్ల ప్రాథమిక ప్రతిపాదన
నవతెలంగాణ – హైదరాబాద్‌

రాష్ట్ర అటవీ శాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు అటవీ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్‌ సీ. సువర్ణ అధ్యక్షతన జపాన్‌ నుంచి వచ్చిన జైకా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా డాక్టర్‌ సువర్ణ తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై జైకా ప్రతినిధులకు వివరించారు. పచ్చదనం పెంపు లక్ష్యంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే జైకా ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్‌ రిజర్వ్‌ల బలోపేతం, వన్యప్రాణి సంరక్షణ, అర్బన్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌, విస్తృత ప్లాంటేషన్‌ కార్యక్రమాలు, క్షీణించిన అడవుల పునరుద్ధరణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ వంటి పలు కీలక కార్యక్రమాలను అమలు చేయనున్నట్టు నిర్ణయించారు. జైకా సహకారంతో ఐదేండ్ల కాలానికి రూ.1,270 కోట్ల విలువైన ప్రాథమిక ప్రతిపాదనను సిద్ధం చేశారు. మొత్తం వ్యయంలో 85 శాతం నిధులను జైకా నుంచి రుణ రూపంలో, మిగిలిన 15 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని ఆ ప్రతిపాదనలో పొందుపరిచారు.ఈ సందర్భంగా జైకా ప్రతినిధులు మాట్లాడుతూ భారత్‌-జపాన్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రస్తుతం భారత్‌లోని పది రాష్ట్రాల్లో అటవీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను జైకా అమలు చేస్తోందని వారు తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలు సమగ్రంగా, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రశంసించారు. అటవీ సంరక్షణతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే దిశగా ఈ ప్రాజెక్టులు ఆదర్శంగా నిలుస్తాయనీ, తెలంగాణతో కలిసి పని చేయడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు.డాక్టర్‌ సి.సువర్ణ మాట్లాడుతూ ”ప్రస్తుత పరిస్థితుల్లో జైకా ప్రాజెక్ట్‌ అటవీ శాఖకు అత్యంత అవసరం. గతంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో వచ్చిన నిధులను మా శాఖ విజయవంతంగా అమలు చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం క్యాంపా నిధులు తగ్గుతున్న నేపథ్యంలో, జైకా వంటి అంతర్జాతీయ సహకార ప్రాజెక్టులు అటవీ శాఖ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి” అని పేర్కొన్నారు. అటవీ రంగాన్ని ఆధునికీకరణ దిశగా తీసుకెళ్లడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఈ జైకా సహకారం కీలక పాత్ర పోషించనుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జైకా ప్రతినిధులను తెలంగాణ ప్రభుత్వం తరపున అటవీ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జైకా ప్రతినిధులు ఇహా చినాట్సు, షిమోజో హిటోమీ, జైకా భారతీయ ప్రతినిధి సిద్ధార్థ్‌ పరమేశ్వరన్‌, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) వినరు కుమార్‌, పీసీసీఎఫ్‌ రత్నాకర్‌ జౌహరి, సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్‌, ఎస్‌.జె. ఆశ, క్షితిజతో పాటు పలు జిల్లాల డీఎఫ్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -