Saturday, November 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజేఎన్‌యూకు జేజేలు

జేఎన్‌యూకు జేజేలు

- Advertisement -

దేశం నలుమూలలా మతోన్మాద మబ్బులు కమ్ముకుంటున్న వేళ..ప్రజాస్వామ్య విలువలు కుంగిపోతున్న వేళ.. ప్రశ్న, ఆలోచన, భిన్నా భిప్రాయం, విమర్శ అనే మాటలకే దేశద్రోహముద్ర వేయబడుతున్న దురవస్థలో-ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం ఫ్యానెల్‌ గెలుపు ఒక చారిత్రాత్మకం. ఇది కేవలం ఫలితం కాదు, ఒక చైతన్యపు పునరుద్ధరణ. మతం పేరుతో ద్వేషాన్ని, జాతీయం పేరుతో అంధభక్తిని నూరిపోసే శక్తులకు ఇక్కడ చోటులేదని చెప్పే ప్రజాస్వామ్య తీర్పు. దేశవ్యాప్తంగా పెచ్చుమీరిన నిరుద్యోగం, ఆర్థిక అసమానతల పర్వం, మతపరమైన ద్వేషం-ఇవన్నీ కలిసి యువతను తిరుగుబాటు దిశగా నడిపిస్తున్నాయని చెప్పడానికి ఇదో తార్కాణం. అధికార వాదం, మతోన్మాదం, బల ప్రయోగం త్రివేణి సంగమంగా మారిన క్యాంపసుల్లో విద్యాస్వేచ్ఛ కోసం, ప్రశ్నించే స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో లెఫ్ట్‌ విన్నింగ్‌ కారుచీకట్లో కాంతిరేఖ. దేశమంటే కేవలం హిందూత్వ రాష్ట్రం కాదని, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, అంతకుమించి ఆలోచన స్వేచ్ఛ అని యువత మరోసారి చాటిచెప్పినదే జేఎన్‌యూ విజయం.

జవహర్‌లాల్‌ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అంటేనే మేధో సంపత్తికి నిలయం, అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చే పరిణామాలకు చర్చా కేంద్రం.అలాంటి వేదికపై ఆరెస్సెస్‌ పరివారం మతాన్ని, విద్వేషాన్ని ప్రోది చేయచూస్తే, ఇక్కడ వామపక్ష సంఘం మాత్రం సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, ప్రగతిశీల రాజకీయాల విలువలతో ముందుకు సాగింది. ఈ ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు. ఉన్నదంతా ఒక నమ్మకం, విశ్వాసం. అదే వామపక్ష విద్యార్థి సంఘాన్ని నేడు దేశ రాజధానిలో నిలబెట్టింది. సెంట్రల్‌ ప్యానెల్‌లో ఉన్న నాలుగు ప్రధాన పోస్టులను లెఫ్ట్‌ యూనిటీ (ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డీఎస్‌ఎఫ్‌) ప్యానెల్‌ కైవసం చేసుకుంది. దీనికితోడు ఐసీ స్థానాలను, అనేక కౌన్సిలర్‌ పదవులను కూడా గెలుచుకుంది. దీనిద్వారా జెఎన్‌యూ చరిత్రలో వామపక్షాల ఆలోచనా సంపద సజీవంగానే ఉందని నిరూపిం చింది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వ దమనకాండ నడిపినా, ఎక్కడ విద్యార్థుల హక్కులు తొక్కబడినా జేఎన్‌ యూ స్వరం ఎన్నడూ విరమించలేదు.

గత కొంతకాలంగా కేంద్రప్రభుత్వం అనేక విశ్వవిద్యాల యాల్లో మితిమీరిన జోక్యం చేసుకుం టోంది.దాని స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ కనీస విద్యార్హతలు లేని తన అనునయుల్ని వైస్‌ ఛాన్సలర్లుగా నియమిస్తూ తమ రాజకీయ అజెండా ప్రకారం మలుస్తోంది. ప్రతిభ, అర్హత, అకాడమిక్‌ కృషికన్నా ‘పార్టీ అనుకూలత” ప్రమాణంగా మారింది. దీంతో యూనివర్సిటీలు స్వతంత్రంగా ఆలోచించలేకపోతున్నాయి. ప్రశ్నించే ప్రొఫెసర్లు బదిలీ, సస్పెన్షన్‌ చేయబడుతున్నారు. విచారణ పేరుతో వేధించబడుతున్నారు. ఎన్సీఈఆర్టీ లాంటివైతే ఏకంగా కేంద్రానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తూ పాఠ్యాంశాలను మారుస్తున్నాయి. ఫలితంగా నేడు గాంధీ గురించి చదవాల్సిందిపోయి గాడ్సే గురించి తెలుసుకోవాల్సిన దుస్థితి. ఇది విద్యలో విపరీత ధోరణికి పరాకాష్ట. ఏదైనా సమస్యపై విద్యార్థులు ప్రశ్నిస్తే వారిని అణచివేయడానికి పరిపాలన వ్యవస్థను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. గతంలో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్నయ్యకుమార్‌ను నిర్భందించింది అందుకే కదా! ప్రశ్నించినందుకు దేశద్రోహం కేసులో అరెస్టయి జైలు జీవితం కూడా అనుభవించాడు.

ఒక్క జేఎన్‌యూనే కాదు, హైదరాబాద్‌, బెనారస్‌, పాండిచేరి- ఎక్కడ చూసినా ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది విద్యను చంపి, అభిప్రాయ స్వేచ్ఛను అడ్డుకుని అధికార ఆలోచనల బంధీగా మార్చడం తప్ప వేరేకాదు. విద్య అంటేనే చైతన్యం. ఆలోచన, విమర్శ, స్వతం త్రత. కానీ, ఆరెస్సెస్‌-బీజేపీ ఏలుబడిలో ఇది ఏమాత్రం కనపడకపోవడం విచారకరం. అందుకే నిజం కోసం నిలబడితే ఏ అరాచకశక్తి కూడా దాని ముందు నిలబడలేదు.

లెఫ్ట్‌లాంటి గొంతుకలు ప్రతి యూనివర్సిటీలో ధ్వనించాలి. ఇప్పుడు ఎరుపు మెరుపుగా తిరిగి వెలు గొందుతుందంటే అది కేవలం ఓట్ల గెలుపు కాదు, ఆది చీకట్లను చెరిపే చైతన్యపు దారి. మతోన్మాదం, అజ్ఞానం, దమనానికి ఎదురు నిలిచే ఆ విద్యార్థి గళం మళ్లీ మంటలెత్తిందంటే, ఈజ్వాల వెలుగులోనే భావిపౌరుల భవిష్యత్తుకు కొత్తమార్గం దొరుకుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -