ఫామ్ 16, 26 ఏఎస్‌ను పరిశీలించాలి
ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో అమలయ్యేలా
చర్యలు తీసుకోవాలి : టీఎస్ టీసీఈఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జేఎన్టీయూహెచ్ తనిఖీలు పారదర్శకంగా నిర్వహించాలనీ, ఫామ్ 16, 26 ఏఎస్‌ను పరిశీలించాలనీ, ఫ్యాకల్టీ, క్యాడర్ రేషియో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్ టీసీఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత లేని ప్రిన్సిపాల్స్ ఉన్న కళాశాలల జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పలు కళాశాలల్లో అధ్యాపకులకు జీతాలు లేవనీ, వారి పే స్లిప్స్, ఏడాది బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ను పరిశీలిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని తెలిపారు. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు చెల్లిస్తున్నామని టీఏఎఫ్ ఆర్సీకీ, జేఎన్టీయూహెచ్‌కు అఫిడవిట్‌లు సమర్పిస్తారే తప్ప కనీస జీతాలు కూడా చెల్లించడం లేదని తెలిపారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన వేతన సంఘం జీతాలు అమలు కావడం లేదని చెప్పారు. అధ్యాపకుల యొక్క ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్ పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
అనేక కాలేజీల్లో అధ్యాపకులకు నిబంధనల ప్రకారం గ్రాట్యూటీ ఆక్ట్ 1972 ప్రకారం చెల్లించాల్సిన గ్రాట్యూటీ అమలు చేయకున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిశీలించడం లేదని సంతోష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా యూనివర్సిటీలు కానీ బోర్డులు గాని దాటవేసే ధోరణిలో పని చేస్తున్నాయని విమర్శించారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అధ్యాపకులకు గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ ఉండాలనీ, కానీ 90 శాతం కాలేజీల్లో అమలు చేయకుండా అధ్యాపకులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. థంబ్ ఫ్యాకల్టీలతో పలు కాలేజీల్లో అధ్యాపకులపై పని భారం పెరుగుతుందనీ, ఉద్యోగ భద్రత లేదనీ, తెలంగాణ ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982, సెక్షన్ -79 అమలు కావడం లేదనీ, వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో 1:2:6 అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలపై జేఎన్టీయూహెచ్ పూర్తిగా పరిశీలించి అధ్యాపకులకు, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా తనిఖీలను పారదర్శకంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.



