అనుకూలంగా 2,181విద్యార్థుల ఓటు
ప్రజాభిప్రాయ సేకరణపై వివాదం
న్యూఢిల్లీ: ఇటీవల నిర్వహించిన ”విద్యార్థి ప్రజాభిప్రాయ సేకరణ”లో జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ రాజీనామాకు భారీ మద్దతు లభించిందని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. గత నెలలో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ చేసిన కుల వివక్ష వ్యాఖ్యలపై ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు విద్యార్థి సంఘం పేర్కొంది.
జేఎన్‌యూఎస్‌యూ వివరాల ప్రకారం, మొత్తం 2,409 మంది విద్యార్థులు ఓటు వేయగా, అందులో 2,181 మంది వీసీ రాజీనామాకు అనుకూలంగా ఓటు వేశారు. 207 మంది ఆమె కొనసాగింపుకు మద్దతు ఇచ్చారు. 21 ఓట్లు చెల్లవని ప్రకటించారు. ”ఈ ప్రజాభిప్రాయ సేకరణ జేఎన్‌యూ విద్యార్థుల భావోద్వేగాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. వీసీ రాజీనామా చేయాలని విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో స్పష్టమైన ఆదేశం ఇచ్చారు” అని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది. అయితే మరోవైపు కొంతమంది విద్యార్థులు, అధ్యాపక సభ్యులు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్ధతను ప్రశ్నించారు. జె.ఎన్.యు.ఎస్.యు నిర్వహించిన ఈ ప్రక్రియకు చట్టపరమైన ఆధారం లేదని వారు అన్నారు. ”వీసీని భారత రాష్ట్రపతి నియమిస్తారు.
ఆమెను తొలగించే లేదా అధికారికంగా రాజీనామా చేయాలని ఆదేశించే అధికారం ఏ విద్యార్థి ప్రజాభిప్రాయ సేకరణకు లేదు,” అని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విమర్శలపై స్పందించిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అదితి మిశ్రా ప్రజాభిప్రాయ సేకరణ సరైన విధానాన్ని అనుసరించి నిర్వహించామని తెలిపారు. ”ఎన్నుకోబడిన విద్యార్థి సంఘం చట్టబద్ధతను ప్రశ్నించడం బాధాకరం. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ప్రతి ఓటు వేసిన విద్యార్థి సంతకం మా వద్ద ఉంది. ఎన్నికైన కౌన్సిలర్లు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు” అని ఆమె అన్నారు. ఇప్పటివరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణపై విశ్వవిద్యాలయ పరిపాలన నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వివాదం గత నెలలో జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వీసీ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. ఆ ఇంటర్వ్యూలో దళితుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలు క్యాంపస్‌లో తీవ్ర విమర్శలకు దారితీశాయి.



