– జేఎన్‌యూలో పండగ వాతావరణం
– 6న ఫలితాలు వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణంలో డప్పు చప్పుడు, నినాదాలతో కోలాహలం నెలకొంది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. అప్పటి నుంచి జెఎన్‌యులో పండగ వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్‌కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు విరామం ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రారంభమైన పోలింగ్‌లో సాయంత్రం 5:30 గంటల వరకు జరగాల్సి ఉంది. అయితే ముగింపు సమయం దాటినా ఓటేసేందుకు క్యూలైన్లలో విద్యార్థులను అనుమతించారు. ఉదయం ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం నాటికి ఓటర్లు క్యూలైన్లలో పోటెత్తారు. మొదటిసారి ఓటర్లు ప్రజాస్వామ్య పండగగా పేర్కొంటూ తమ ఐడీ కార్డులతో ఓటు వేసేందుకు వచ్చారు. ఓటింగ్ ముగిసిన అనంతరం రాత్రి 9:30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తిస్థాయి ఫలితాలు ఈ నెల 6న ప్రకటిస్తామని ఎన్నికల కమిటీ తెలిపింది. నాలుగు కీలకమైన సెంట్రల్ ప్యానెల్ పదవుల (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి)కు మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాదాపు 9,043 మంది ఓటర్లున్నారు. పోలింగ్ బూత్ వెలుపల జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షులు, ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషీఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమంపై తాము దృష్టి పెట్టామని, ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే అంశాలను లేవనెత్తామని తెలిపారు. తమ వామపక్ష కూటమి నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టులను గెలుచుకుంటుందని పేర్కొన్నారు. 20 ఏండ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆకాంక్ష మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను జేఎన్‌యూ ఎన్నికల గురించి మాత్రమే విన్నానని, మొదటి సారి తాను ఎన్నికలను చూడటం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందన్నారు. ఇదే సమయంలో తొలిసారి జేఎన్‌యూ ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ఉత్సాహంగా ఉందని తెలిపారు.
కోల్‌కతాకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మాట్లాడుతూ.. జేఎన్‌యూ విద్యార్థి సంఘ ఎన్నికలు ఒక వేడుకలా అనిపిస్తుందని, తాను గతంలో చదివిన యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగలేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప పండగలాంటిదని అన్నారు. 25 ఏండ్ల పీహెచ్‌డీ విద్యార్థి మహేంద్ర మాట్లాడుతూ.. వామపక్ష అనుబంధ సంఘాలు కనీసం తమ సమస్యలను లేవనెత్తాయని, పరిమిత అధికారాలు ఉన్నప్పటికీ వారు పరిపాలన విభాగాన్ని వినేలా చేస్తారని తెలిపారు.
కోలాహలంగా జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -



