ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి : నిరుద్యోగ జేఏసీ డిమాండ్
నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా
ఆర్.ఎల్. మూర్తి ఎన్నిక
సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక
నవతెలంగాణ-సిటీబ్యూరో/ ఉస్మానియా యూనివర్సిటీ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ, అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా విద్యా, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు, నిరుద్యోగుల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యలపై ఐక్య పోరాటం కోసం ‘నిరుద్యోగ జేఏసీ’ ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా ఓయూ పరిశోధక విద్యార్థి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-కన్వీనర్‌గా రామటెంకి శ్రీను, కమిటీ సభ్యులుగా నరేష్, ఆంజనేయులు, శేఖర్, క్రాంతి, రితీష్‌ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సదస్సులో.. ఓయూ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఉస్మానియా గడ్డ అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు అని, నాడు సమాజ నిర్మాణం కోసం పోరాడిన స్ఫూర్తితోనే నేడు విద్యా రక్షణ, ఉపాధి కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ వంటి సంఘాల పోరాట పటిమను కొనియాడారు. ప్రొ. బిమినేని రామ్ షాఫర్ట్ మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలనీ, ఉస్మానియాలో ప్రత్యామ్నాయ ఆలోచనలకు వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రొ.వంశీధర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ జేఏసీ ఏర్పాటును స్వాగతిస్తూ, యూనివర్సిటీల అభివృద్ధికి, పోస్టుల భర్తీకి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ప్రభుత్వానికి హెచ్చరిక.. ప్రధాన డిమాండ్లు..
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, జేఏసీ నూతన కన్వీనర్ ఆర్.ఎల్. మూర్తి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఆశించిన న్యాయం చేయలేదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఖాళీ ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఓయూకు హామీ ఇచ్చిన రూ. 1,000 కోట్లు వెంటనే విడుదల చేయాలనీ, ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలనీ, పీజీ విద్యార్థులకు రూ.8వేలు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ. 25వేల ఫెలోషిప్ అందించాలన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద రుణాలు మంజూరు చేయాలన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామనీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ సదస్సు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి కో-కన్వీనర్ రామటెంకి శ్రీను స్వాగతం పలకగా, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి అజరు కుమార్ వందన సమర్పణ చేశారు. సీఐటీయూ యూనివర్సిటీ కార్యదర్శి టి.మహేందర్, ఏఐఎస్ ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షులు ఉదరు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు సైదులు యాదవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చిరంజీవి, హంస రాష్ట్ర నాయకులు సైదులు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అవ్వరు వేణు, డీఎస్‌ఎఫ్‌ఐ సూర్య ప్రకాష్, బీసీఎస్‌ఎఫ్ ఓంకార్, టీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజరు నాయక్, డీవైఎఫ్‌ఐ నాయకులు జావిద్, శ్రీనివాస్, క్రాంతి కుమార్, విష్ణు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్ కుమార్, అశోక్ కుమార్, సిద్ధార్థ, రితీష్, మిథున్, రాజు, అనిల్ భాష, శ్రీనాథ్, సురేష్, తేజ, నిరుద్యోగులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



