Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంనకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ అరెస్టు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ అరెస్టు

- Advertisement -

ఎక్సైజ్‌ కోర్టులో హాజరు
ఇబ్రహీంపట్నం:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్‌ పోలీసులు దూకుడు పెంచారు. జోగి రమేష్‌ను ఆదివారం అరెస్టు చేసి విజయవాడ సిట్‌ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకూ జోగి రమేష్‌తోపాటు ఆయన సోదరుడు రాము, అనుచరుడు ఆరేపల్లి రాముసహా మొత్తంగా 20 మందిని అరెస్టు చేసినట్లయింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసానికి చేరుకున్న ఎక్సైజ్‌, పోలీస్‌, క్లూస్‌ టీములతో కూడిన సిట్‌ బృందం విస్తృత తనిఖీలు చేసింది. జోగి రమేశ్‌, ఆయన భార్య ఫోన్లను సిట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఆయన నివాసంలోని సిసి ఫుటేజీలను, పలు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మూడున్నర గంటలపాటు హైడ్రామా సాగింది. పోలీసులు జోగి రమేష్‌ను అరెస్టు చేసి విజయవాడలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించారు. రమేష్‌ను, రామును విడివిడిగా విచారించారు. జనార్ధనరావుతో ఆర్థిక సంబంధాలపై ప్రశ్నించినట్టు సమాచారం. రమేష్‌ను సుమారు ఏడు గంటల పాటు విచారించారు. ఈ కేసులో ఎ-18గా జోగి రమేష్‌ను, ఎ-19గా జోగి సోదరుడు రామును అధికారులు చేర్చనున్నారు. వారిద్దరినీ ఆదివారం రాత్రి వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జిజిహెచ్‌కు తరలించారు. అక్కడికి తీసుకొస్తారనే సమాచారంతో జోగి రమేష్‌ అనుచరులు, వైసిపి కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, పోలీసులకు, వారికి మధ్య వాగ్వివాదం, తోపులాట జరగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైద్యపరీక్షల అనంతరం జోగి రమేష్‌ను, రామును పోలీసులు ఎక్సైజ్‌ కోర్టులో హాజరుపర్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -