Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంజోగి రమేష్‌ ఇంటిపై దాడి

జోగి రమేష్‌ ఇంటిపై దాడి

- Advertisement -

పెట్రోలు బాటిళ్లు, రాళ్లు రువ్విన టీడీపీి శ్రేణులు
కారిడార్‌, ఫర్నీచర్‌ దగ్ధం, ప్లెక్సీలకు నిప్పు
ఇబ్రహీంపట్నం :
మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేష్‌ ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని ఆయన ఇంటిపై ఆదివారం సాయంత్రం రాళ్లు రువ్వాయి. కర్రలతో దాడి చేశాయి. ఇంటిపై పెట్రోల్‌ బాటిళ్లు విసిరి నిప్పంటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై జోగి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి టిడిపి శ్రేణులు ఇబ్రహీంపట్నం చేరుకున్నాయి. రింగ్‌ సెంటరులో నిరసన తెలిపి అక్కడి నుంచి నేరుగా ఒక్క ఉదుటన జోగి నివాసం వైపు టిడిపి కార్యకర్తలు పరుగులు పెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారిని నెట్టి వేసి జోగి ఇంటిపైకి దూసుకెళ్లారు. కర్రలు, రాళ్లు, పెట్రోల్‌ బాటిళ్లతో ఆయన ఇంటిపై దాడి చేశారు. ఫస్ట్‌ఫ్లోర్‌ కారిడార్‌లోకి పెట్రోల్‌ బాటిల్‌ విసిరారు. దీంతో, ఇంట్లో మంటలు వ్యాపించి కారిడార్‌, ఫర్నీచర్‌ దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ కమ్మింది. ఇంటి ముందున్న జోగి-శకుంతల ప్యాలెస్‌ బోర్డును పగులగొట్టారు. ఫ్లెక్సీలకు, బ్యానర్లకు నిప్పు పెట్టారు. రాళ్ల దాడితో కారిడార్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. బాదులతో గుద్దడంతో గేటు పాక్షికంగా దెబ్బతింది. అక్కడ పోలీసులు ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారు. దీంతో, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు టిడిపి శ్రేణులను వెనక్కి పంపారు. జోగి ఇంటి ముందు జోగి, అంబటి దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు టిడిపి శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టిడిపి శ్రేణులు మళ్లీ రింగ్‌ సెంటర్‌కు చేరుకుని జోగి రమేష్‌, అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. దాడి సమయంలో జోగి రమేష్‌ తండ్రి మోహనరావు, రమేష్‌ సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్‌ ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్‌ తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. దాడి సమాచారం తెలుసుకుని వైసిపి శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇరు పార్టీల వారు పోటాపోటీగా వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసిపి నేతలు, కార్యకర్తలు జోగి ఇంటిని పరిశీలించారు. సంఘటన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ : జోగి రమేష్‌
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అవుతోందని మాజీ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. వైసిపి నాయకులపై, కుటుంబ సభ్యులపై, ఇళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఫేక్‌ కేసులు పెట్టి 83 రోజులు తనను, తనతోపాటు తన సోదరుడిని జైల్లో పెట్టారని, అది చాలక ఇప్పుడు తన ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి తనను, తన కుటుంబాన్ని హత్య చేయాలని చూశారని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన తనపై చంద్రబాబు, లోకేష్‌ పధకం ప్రకారం దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నా చోద్యం చూస్తుండడం శోచనీయమన్నారు. లోకేష్‌ తనపై దాడులు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ‘గుర్తుపెట్టుకో లోకేష్‌… నా ఇంటి నుంచి నీ ఇంటికి ఎంత దూరమో, నీ ఇంటి నుంచి నా ఇంటికీ అంతే దూరం’ అని హెచ్చరించారు. ‘కూటమి’ గుండాలకు, బ్లేడ్‌ బ్యాచులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. లోకేష్‌… ‘నీ పిల్ల చేష్టలకు భయపడను. లోకేష్‌కు ఒళ్లు తగ్గిందిగానీ, మెదడు దొబ్బింది అని గతంలోనే నేను చెప్పాను. అది మరోసారి రుజువైంది’ అని అన్నారు.

చెవిరెడ్డిని పరామర్శించిన జోగి బ్రదర్స్‌
జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చిన చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని… జోగి రమేష్‌, ఆయన సోదరుడు ఆదివారం పరామర్శించారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

జోగి రమేష్‌ గతంలో చంద్రబాబు, లోకేష్‌లపై చేసిన వ్యాఖ్యలు
‘కల్తీ మాటలతో టిడిపి కల్తీగా మారింది. మంత్రి లోకేశ్‌కు చిప్‌ దెబ్బతింది. బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చేసిన ప్రచారాన్ని సిట్‌ నిగ్గు తేల్చింది’ అంటూ జోగి రమేష్‌ జైలు నుండి విడుదలైన సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ‘టిడిపి కల్తీ నాయకత్వంలో నడుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ అన్నావు. పరకామణి కేసు అన్నావు. కల్తీ మద్యం అని కేసు పెట్టావు. కల్తీ మద్యం కేసుపై మాట్లాడుకోవడానికి చంద్రబాబు, లోకేశ్‌ రండి… సొంత సిట్‌ వేసుకొని నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందారు’ అంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -