విజేతకు రూ.1 లక్ష ప్రైజ్‌మనీ అందించిన కాసాని వీరేశ్
నవతెలంగాణ- హైదరాబాద్:
కాసాని యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో జోగులాంబ లయన్స్ విజేతగా నిలిచింది. బుధవారం ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో జోగులాంబ లయన్స్ 35-21తో భద్రాద్రి బ్రేవ్స్‌పై అద్భుత విజయం సాధించింది. టైటిల్ పోరులో ఆది నుంచే ఇరు జట్లు హౌరాహౌరీగా తలపడ్డాయి. ప్రథమార్ధం ముగిసే సరికి జోగులాంబ 16-12తో 4 పాయింట్ల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. చావోరేవో తేల్చుకోవాల్సిన ద్వితీయార్థంలోనూ జోగులాంబ లయన్స్ అదే దూకుడు కనబరుస్తూ పైచేయి నిలుపుకుంది. మెరుపు రైడింగ్‌కు తోడు పటిష్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో జోగులాంబ లయన్స్ సఫలమైంది. టోర్నమెంట్ బెస్ట్ రైడర్‌గా రాజు, ఉత్తమ డిఫెండర్‌గా నవీన్, ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లక్ష్మణ్ ప్రోత్సాహకాలు అందుకున్నారు. విజేత జోగులాంబకు రూ. లక్ష, రన్నరప్ భద్రాద్రి టీమ్‌కు రూ. 75 వేల నగదు బహుమతి దక్కించుకున్నాయి. టోర్నీ ముగింపు కార్యక్రమానికి డీసీపీ హైదరాబాద్ రాహుల్ హెగ్డె ముఖ్య అతిథిగా హాజరై.. తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డిలతో కలిసి విజేత, రన్నరప్‌లకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు.