కప్పాడు భూముల్లోకి కదిలిన ఎర్రసైన్యం
ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్లు జారీ చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
’35 ఏండ్ల కప్పాడు భూ పోరాటంలో పేదలదే విజయం.. నాటి నుంచి కాస్తులో ఉండి సాగు చేసుకున్నారు. బినామీ భూస్వామి సుదర్శన్‌రెడ్డి అన్ని కోర్టుల్లో కేసు వేశారు.. జిల్లా కలెక్టర్, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ అన్ని కేసుల్లోనూ పేదలు విజయం సాధించారు. తీర్పు పేదల పక్షం రావడంతో కేసులు వేసిన బినామీ భూస్వామి తోక మూడవక తప్పలేదు. ఈ భూమి మనదే.. రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు జారీ చేయాలి.. హక్కులు కల్పించాలి.. పట్టాలు వచ్చే వరకూ సమిష్టి ఉద్యమాన్ని కొనసాగించాలి’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేదలకు పిలుపునిచ్చారు.
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పాడులోని సర్వేనెంబర్ 197 నుంచి 263 వరకు ఉన్న 14 సర్వే నెంబర్లలోని 98.20 ఎకరాల మిగులు భూముల్లోకి జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా నాయకత్వంతో కలిసి జాన్‌వెస్లీ ట్రాక్టర్లతో భూమిని దున్నారు.. సాలు పెట్టారు.. విత్తనాలు వేశారు.. ఎర్రజెండాలు పాతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 35 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ భూములు తనవే అనుకున్న భూస్వామి పని అయిపోయిందని, ఇక పోట్లాడాల్సింది ప్రభుత్వంతోనేనని స్పష్టం చేశారు. బినామీ పేర్లతో ఈ భూమిని కాజేయాలని చూసిన సుదర్శన్ రెడ్డి(బుచ్చిరెడ్డి)కి ఈ భూమిపై ఏ హక్కూ లేదన్నారు. సుమారు రూ.200 కోట్ల విలువ చేసే ఈ భూములను కాజేసేందుకు సుదర్శన్‌రెడ్డి కుట్ర పన్నినట్టు చెప్పారు. అన్ని కోర్టుల్లోనూ ఓడిపోయినా ఇంకా ఎందుకు భూమిపై ఆశలు పెట్టుకున్నావని ప్రశ్నించారు. 98.20 ఎకరాల భూమి మిగులుదిగా కోర్టులు తేల్చాయన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో భూములు సాధించామని తెలిపారు. మిగులు భూముల జోలికి వస్తే సుదర్శన్ రెడ్డి కింద ఉన్న మరో 100 ఎకరాల భూముల్లో కూడా ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ పేదల పక్షమే తీర్పు ఇచ్చారని, హైకోర్టూ పేదల పక్షమే తీర్పు ఇచ్చిందని, చివరికి సుప్రీంకోర్టు కూడా జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని సూచించిందని స్పష్టం చేశారు. భూములు పోతాయన్న భయంతో తన కొడుకుల పేరుమీద పట్టాలు చేసిన భూస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ భూములకు పట్టా సర్టిఫికెట్లు జారీ అయ్యే వరకూ సమిష్టిగా ఉద్యమించాలని సూచించారు. అవసరమైతే జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రగా తరలిరావాలని అన్నారు. కప్పాడు పోరాటాన్ని 35 ఏండ్లపాటు కొనసాగించిన యోధులకు విప్లవ అభినందనలు తెలిపారు. విజయం చివరి అంచుల్లో నిలిచామని, ఫలితాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, కె.భాస్కర్, కె.జగన్, డి.జగదీష్, రామ్‌చందర్, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ బుగ్గ రాములు, సిహెచ్ జంగయ్య, డి.కిషన్, పి.జగన్ తదితరులు ఉన్నారు.
సాలు పెట్టి..విత్తనమేసి..జెండా పాతిన జాన్‌వెస్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES