పినరయికి కేంద్ర మంత్రి అథావలే ఆహ్వానం
అప్రజాస్వామికమంటూ మండిపడిన కేరళ ఎల్డీఎఫ్
తిరువనంతపురం : కేంద్ర మంత్రి రాందాస్ అథావలే కొత్త వివాదానికి తెరలేపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆహ్వానించారు. ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి మరిన్ని కేంద్ర నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏతో చేతులు కలపడం విప్లవాత్మక అడుగు అవుతుందని అథావలే ప్రకటించారు. దీని ద్వారా కేరళకు నిధుల ప్రవాహం పెరుగుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ‘పెద్ద ప్యాకేజీ’ లభిస్తుందని అన్నారు. నూతన ఏర్పాటు కింద కేరళ ముఖ్యమంత్రిగా పినరయి కొనసాగవచ్చునని చెప్పారు.
అప్రజాస్వామికం…రాజ్యాంగ విరుద్ధం
అథావలే ప్రకటనపై అధికార ఎల్డీఎఫ్ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి పిలుపులు అప్రజాస్వామికమని ధ్వజమెత్తింది. అథావలే వ్యాఖ్యలను సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ ఖండించారు. ఆ వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఇలాంటి చర్యలు భారత సమాఖ్య వ్యవస్థకు అవమానకరమని అన్నారు. రాజ్యాంగ సూత్రాలపై ఆర్‌ఎస్‌ఎస్ జరుపుతున్న అతిక్రమణలను ఇవి ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. అథావలే ప్రకటన చూస్తుంటే నయా ఫాసిజం వైపు అడుగులు వేస్తున్నట్లు ఉన్నదని వ్యాఖ్యానించారు. కేరళ రాజకీయ చరిత్రపై కేంద్ర మంత్రికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలతో సీపీఐ (ఎం) దీర్ఘకాల సైద్ధాంతిక పోరాటం సాగిస్తోందని గుర్తు చేశారు.
మతతత్వంపై రాజీ లేదు
మతతత్వంపై రాజీ పడబోమని గోవిందన్ స్పష్టం చేశారు. మత వైఖరిని ప్రదర్శించే వారిని సీపీఐ (ఎం) వ్యతిరేకిస్తుందని చెప్పారు. మతతత్వం అంటే ఏమిటో, లౌకికవాదం అంటే ఏమిటో
పార్టీకి స్పష్టత ఉన్నదని అన్నారు. తిరువనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా బలంగా నిలబడిందే సీపీఐ (ఎం) ఉద్యమం. పార్టీ వైపు నుంచి మతపరమైన వ్యాఖ్యలు రావు. మృదువైన హిందూత్వ వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవకాశాలు వచ్చినప్పుడు మతతత్వ శక్తులతో చేయి కలుపుతుంది.
జమాతే ఇస్లామీతో జట్టు కట్టేందుకు ప్రతిపక్ష నేత వీడీ సతేశన్ వెనకడుగు వేయరు. సీపీఐ (ఎం)పై ఉద్దేశపూర్వకంగా దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలి’ అని అన్నారు. మతతత్వ వ్యతిరేకతే సీపీఐ (ఎం) హాల్‌మార్క్ అని గోవిందన్ వ్యాఖ్యానించారు. మతతత్వం గురించి ఎవరు ఎంత గొప్పగా చెప్పినా పార్టీ దానిని అంగీకరించదని స్పష్టం చేశారు. రాబోయే రాజకీయ పరిస్థితులలో కూడా పార్టీ ఈ వైఖరికే కట్టుబడి ఉంటుందని గోవిందన్ తెలిపారు.



